మిస్బా ఉల్ హక్ సెలెక్టర్ పదవికి ఎసరు?

by Shiva |
మిస్బా ఉల్ హక్ సెలెక్టర్ పదవికి ఎసరు?
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ పదవితో పాటు జాతీయ చీఫ్ సెలెక్టర్‌ (National Chief Selector)గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిస్బా ఉల్ హక్ పదవికి ఎసరు వచ్చేటట్లు ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆ పర్యటన ముగిసిన అనంతరం జాతీయ సెలెక్టర్ పదవిని మిస్బా ఉల్ హక్ వదలుకోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వర్గాలు చెబుతున్నాయి.

మిస్బా స్థానంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఒకరిని ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రెండు పదవుల్లో ఉండటం వల్ల మిస్బాపై భారం పెరిగిపోతున్నదని, అందువల్ల జట్టు ప్రదర్శన కూడా తగ్గుతున్నదని పీసీబీ (PCB) పెద్దలు భావిస్తున్నారు. రాబోయే మూడేళ్లలో ఐసీసీ (ICC) ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో అతడిని పూర్తిగా కోచ్ పదవికే పరిమితం చేయాలని అనుకుంటున్నారు. అలాగే వన్డే, టీ20 వరల్డ్ కప్‌లకు సమర్థులైన క్రికెటర్లను ఎంపిక చేసే బాధ్యత వేరే వాళ్లకు అప్పగించాలని పీసీబీ (PCB) భావిస్తున్నది.

వాస్తవానికి ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ను జట్టు హెడ్ కోచ్‌గానే మొదట ఎంపిక చేశారు. అయితే సరైన సెలెక్టర్ దొరకక పోవడంతో గత ఏడాది అతనికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మిస్బా రెండు బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. కానీ అతనిపై భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా భారం తగ్గించాలని పీసీబీ (PCB) కొత్త సెలెక్టర్ కోసం వేట ప్రారంభించింది.

Advertisement

Next Story