ప్రభుత్వ పనులకు రూ.230కే బస్తా సిమెంటు

by  |
ప్రభుత్వ పనులకు రూ.230కే బస్తా సిమెంటు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ పనులు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మూడేళ్ల పాటు రూ.230కే బస్తా సిమెంటు సప్లయి చేసేందుకు కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి. గురువారం సిమెంటు కంపెనీల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి లాక్‌డౌన్ నేపథ్యంలో సిమెంట్ ధరలు తగ్గించాలని కోరారు. ప్రస్తుత సంక్షోభంతో రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియల్ ఎస్టేట్ రంగానికి చేయూతనిచ్చేందుకు ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరారు. రియాల్టీ రంగంపై అదనపు భారం పడితే అది అంతిమంగా సామాన్య ప్రజలు, వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ వివరించారు.

ఇప్పటివరకు తెలంగాణలో నిర్మాణ రంగం వృద్ధిలో కొనసాగిందని, కొనసాగించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు. ప్రస్తుతం అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటని, ఈ రంగం ఒడిదొడుకులకు గురైతే ప్రభావం సిమెంట్ కంపెనీలపై ఉంటుందని గుర్తుచేశారు. సిమెంట్ ధరలు తగ్గించాలని ప్రభుత్వం చేసిన సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వారంలో ఏ మేరకు ధరను తగ్గించేది ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు అభ్యర్థించారు. గతంలో 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 230 రూపాయలకి ఒక బస్త ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓను కూడా జారీ చేసింది. సమావేశంలో మరో మూడు సంవత్సరాల పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తో పాటు ప్రభుత్వ పథకాలకు రూ.230కి సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు.

సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న హుజూర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధికారులకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆర్అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని, శిక్షణా కేంద్రానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే సైదిరెడ్డి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి శిక్షణ కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.


Next Story