ప్రజల్లో ఆందోళన వద్దు.. అధికారులు అలర్ట్‌గా ఉన్నారు: మంత్రి వేముల

by Shyam |
ప్రజల్లో ఆందోళన వద్దు.. అధికారులు అలర్ట్‌గా ఉన్నారు: మంత్రి వేముల
X

దిశ, బాల్కొండ: గులాబ్ తుఫాన్, భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. సోమవారం నుంచి ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల.. మంగళవారం ఆకస్మికంగా హైదరాబాద్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. జిల్లా అధికారులు, ప్రాజెక్టు అధికారులు, ఆర్డీఓతో కలిసి ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో విపరీతంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, అక్కడక్కడ రోడ్లు కొంతమేర దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. కొన్నిచోట్ల పంట పొలాల్లో నీరు చేరడం వల్ల రైతులకు నష్టం జరిగిందని.. అధికారులతో వాటిని అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. దేవుని దయవల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. పరిస్థితి పూర్తిగా యంత్రాంగం అదుపులో ఉందని, అధికారులందరూ వారి వారి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున ప్రజలు తప్పనిసరి అయితే తప్పా బయటకు వెళ్ళవద్దని మంత్రి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed