అంతకంటే ఎక్కువే తిట్టగలం : తలసాని

by Shyam |
అంతకంటే ఎక్కువే తిట్టగలం : తలసాని
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రాడ్యుయేట్‌లు అందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి కాలనీ, బస్తీ, అపార్ట్మెంట్‌లలో పర్యటించి గ్రాడ్యుయేట్‌లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థికసాయం అందని వారు ఆందోళన చెందొద్దని అన్నారు. మిగిలిన వారికి కూడా ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించారని ఆయన వివరించారు.

ప్రకృతి వైపరిత్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేటివరకూ ఎలాంటి సాయం అందించలేదని అన్నారు. అంతేగాకుండా తెలంగాణ బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ 1000 కోట్లు, వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకురాలేని బీజేపీ ఎంపీలు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాము అంతకంటే ఎక్కువగా తిట్టగలమని హితవు పలికారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న రోజులలో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Next Story