పసలేని రాజకీయాలతో… ప్రజలకు ఇబ్బందులు

by  |
పసలేని రాజకీయాలతో… ప్రజలకు ఇబ్బందులు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆలీబాబా 40 దొంగల ముఠాలా కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని పలు చెరువుల్లో ఐదో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని, కులవృత్తులను ప్రోత్సహించేలా రూ.వేల కోట్లతో కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలు ఈ సంవత్సరం విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉచితంగా కృత్రిమ గర్భధారణను చేపడుతున్నామని తెలిపారు. మత్స్యకారులు, గీత కార్మికులు, పాడి పెంపకందారులు, రైతులు అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. హుజూర్ నగర్‌లో మాజీ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ ఇక్కడికి చుట్టం చూపుగా వచ్చిపోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూర్‌నగర్ నియోజక‌వర్గంలో ఇప్పటివరకు 50 శాతం పైగా గొర్రె పిల్లల పంపిణీ చేశామని గుర్తు చేశారు.

మిగతా వారికి కూడా ఈనెల లోపే పంపిణీ చేస్తామని వివరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. చెరువుల్లో పెంచిన చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు వాహనాలను, మార్కెట్ సదుపాయం ప్రభుత్వమే కల్పించిందన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడంతో వందల కోట్ల సంపద నేరుగా మత్స్యకారుల చేతుల్లో చేరుతున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, హుజూర్ నగర్ జెడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీను పాల్గొన్నారు.



Next Story