తడబడ్డ తలసాని.. అన్నిటికీ కేటీఆర్ టీంపైనే భారం

by Anukaran |
Minister Talasani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చితికిల పడ్డారు. రెండు వారాలుగా జీహెచ్ఎంసీలో చేపడుతున్న ఫీవర్ సర్వేలో ఎంతమందికి కొవిడ్ లక్షణలు గుర్తించారో, ఎందరిని ఐసోలేషన్​ కేంద్రాలకు తరలించారో చెప్పాలని ప్రశ్నించగా నీళ్లు నమిలారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు కరోనా నివారణా చర్యలు, నగరంలో ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడీయా సమావేశంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంత్రి ప్రసంగాన్ని కొనసాగించగా.. మీడియా ప్రతినిధులు ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత, జీహెచ్ఎంసీ వైఫల్యాలపై ప్రశ్నలు సంధించడంతో శ్రీనివాస్ యాదవ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్రేటర్‌లో చేస్తున్న ఫీవర్ సర్వేలో ఇప్పటి వరకూ ఎంతమందికి కొవిడ్ లక్షణాలు గుర్తించారో, ఎందరిని ఐసోలేషన్‌కు పంపించారో తెలపాలని మంత్రిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోయారు. ఉదయం నుంచి సమీక్షా సమావేశం ఇదే విషయాలపై జరగడం గమనార్హం.. ఇక నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కోసం సగటున రూ.లక్షన్నర బిల్లు వేస్తున్నారని, ఒక ఆస్పత్రయితే ఏకంగా రూ.28 లక్షల బిల్లు వేసిందని, ఈ రోజు కూడా కొవిడ్ పేషంట్ కు ఓ హాస్పిటల్ రూ.4.5 లక్షల వేసిన బిల్స్ తమ వద్ద ఉన్నాయని మీడీయా ప్రతినిధులు చెప్పడంతో ఏం చెప్పాలో తెలియక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయోమయానికి గురయ్యారు.

బేగంపేటలో రేవంత్ రెడ్డి భోజనాలు అందించేందుకు వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ మంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉదయం పది గంటల లోపే భోజనాలు పెట్టాలని, లాక్‌డౌన్ ఉన్నప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజనాలను ఉచితంగా అందిస్తున్నామని, ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయడం తగదంటూ మంత్రి హితవు పలికారు. భోజనానికి జీహెచ్ఎంసీ రూ.5 వసూలు చేస్తోందంటూ మీడియా ప్రతినిధులు సూచించగా.. అదేం పెద్ద సమస్య కాదంటూ మంత్రి నాలుక్కరుచుకున్నారు. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం పక్కనే ఉన్న అన్నపూర్ణ కేంద్రాన్ని కూడా మూసివేశారని జర్నలిస్టులు గుర్తుచేశారు. ఇక ఎన్జీఓలు, సామాజిక కార్యకర్తలు కూడా లాక్‌డౌన్ సమయంలో అవసరమున్న వారికి భోజనాన్ని అందిస్తున్నారని వివరించారు. పేషంట్ కుటుంబ సభ్యులకు, నిరాశ్రయులకు, యాచకులకు మధ్యాహ్నం, రాత్రి కూడా ఆకలి వేస్తోందని, ఉదయం పది లోపే అంటే రెండు పూటల భోజనం సంగతేమిటని నొక్కి ప్రశ్నించగా.. మంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో మీడియా మైక్‌లను ఆఫ్​ చేయాలని, ఏది పడితే అది అడుగుతారా అంటూ గుర్రుగా మాట్లాడారు.

కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు సేవలందించే విషయాలు, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నివారపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలకు అన్నిటికీ కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే టాస్క్ ఫోర్స్ కమిటీనే చూసుకుంటుందంటూ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​వివరించారు. ఫీవర్ సర్వే వివరాలను కూడా చెప్పేందుకు మంత్రి తడబడటం గమనార్హం.. జీహెచ్ఎంసీ ప్రతీ రోజూ ప్రెస్ రిలీజ్ చేస్తోందని, అందులో ఎంతమందికి కొవిడ్ కిట్స్ ఇచ్చారో, ఎంతమందిని ఐసోలేషన్​ కేంద్రాలను తరలించారో ఉండటం లేదని మీడీయా ప్రతినిధులు గుర్తు చేశారు. తాను ఆ వివరాలను పంపిస్తానంటూ మంత్రి దాటవేశారు. అయితే సోమవారం జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటనలో ఆ వివరాలు రాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed