ఈ ఏడాది 28,704 చెరువుల్లో చేప విత్తనాలు : Telangana Fisheries Department

by Shyam |   ( Updated:2021-05-27 11:23:10.0  )
ఈ ఏడాది 28,704 చెరువుల్లో చేప విత్తనాలు : Telangana Fisheries Department
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రాష్ట్రంలోని 28,704 చెరువుల్లో ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ(fish seed Distribution) చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మొత్తం 93 కోట్ల చేప విత్తనాలను చెరువుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం రూ. 89 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేపలతో పాటు రొయ్యల పెంపకాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం రొయ్యల పెంపకానికి అనువుగా ఉండే చెరువులను గుర్తించి రూ. 25 కోట్లతో10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చేప విత్తనాల కొనుగోలు ఎలాంటి అవకతవకలు జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఉన్న చేప పిల్లలను మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. 10 రోజులలలో టెండర్ లు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తప్పనిసరిగా చేప పిల్లల సరఫరా దారులకు చెందిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా అనే అంశాలన నిశితంగా పరిశీలించాలని, తనిఖీ లను తప్పని సరిగా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చేపల పెంపకం చేపట్టేందుకు అనువుగా 34,024 చెరువులు ఉన్నట్లు గుర్తించి వీటలో 28,704 చెరువులకు జియోట్యాగింగ్ చేపట్టామని చెప్పారు. మిగిలిన 5,056 చెరువులకు జియోట్యాగింగ్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. విజయ పాల ఉత్పత్తుల ఔట్ లెట్స్ తరహాలో త్వరలో తెలంగాణా బ్రాండ్ పేరుతో చేపలు, సముద్ర చేపలు, చేపల వంటకాల విక్రయాలను పెద్ద ఎత్తున చేపట్టన్నునట్లు తెలిపారు. ఇందుకోసం నూతనంగా 500 ఔట్ లెట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సైజ్ కు వచ్చిన చేపలను ఆయా జిల్లాల మత్స్య శాఖ అధికారుల సమన్వయంతో మత్స్య ఫెడరేషన్ చేపలను కొనుగోలు చేసి మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ కు, రిటేల్ విక్రయదారులకు సరఫరా చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని వలన దళారులకు చేపలను తక్కువ ధరకు విక్రయించుకొని నష్టపోతున్న మత్స్య కారులకు మంచిధర చెల్లించి ఆదుకునే అవకాశం ఉంటుందని, ఇటు ప్రజలకు నాణ్యమైన చేపలను తక్కువ ధరలకు విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Healthy aquaculture for people and environment | Beijer Institute

మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్వహణ కోసం అనువైన స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం వలన అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ప్రజల వద్దకే నాణ్యమైన చేపలు, చేపల వంటకాలను తీసుకెళ్ళాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను పంపిణీకి చర్యలు చేపట్టి ఇప్పటి వరకు 100 వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేశామన్నారు. 60 శాతం సబ్సిడీతో వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేపట్టి మత్స్యకారులను ప్రోత్సహింస్తున్నామన్నారు. ఈ ఔట్ లెట్ లతో సత్ఫలితాలు వస్తున్నాయని, ప్రజల నుండి కూడా మంచి స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మత్స్యకారులు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే చేపల వేట కొనసాగించే వారని, తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నందున సంవత్సరం పొడవున చేపల వేట కొనసాగిస్తూ మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. మత్స్యకార వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలలో వెలుగులు నింపాలి అనేది ముఖ్యమంత్రి లక్ష్యం అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

Advertisement

Next Story