‘‘ప్రజలంతా లాక్ డౌన్ పాటించాలి’’

by vinod kumar |   ( Updated:2020-04-12 01:55:50.0  )
‘‘ప్రజలంతా లాక్ డౌన్ పాటించాలి’’
X

దిశ, రంగారెడ్డి: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా తప్పనిసరి‌గా లాక్‌డౌన్‌ను పాటించాలనీ, తద్వారానే కరోనా కట్టడి సాధ్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ దృష్ట్యా ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యావసరాల పంపిణీ, ధాన్యం కొనుగోలు తదితర అంశాల‌పై జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల చైర్మన్ నాగేందర్ గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కొవిడ్ 19 కేసుల సంఖ్య జిల్లాలో పదికి పెరగడంతో వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్, వైద్య, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్‌లో మొత్తం 8 సి జోన్లు ఉన్నాయనీ, ఈ ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ డోర్ డెలివరీ చేయాలని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 15 వేల మంది సి జోన్‌లో ఉన్నారనీ, వారికి కావాల్సిన ఏర్పాట్ల‌పై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. వికారాబాద్ జిల్లాలో నమోదైన కేసుల్లో సగానికి పైగా వికారాబాద్ నియోజకవర్గం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశమనీ, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వికారాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి గర్భిణులు, ఇతర అత్యవసరం ఉన్న వాళ్లు వెళ్తున్నందున దగ్గు, జలుబు, జ్వరం, గొంతులో నొప్పి, శ్వాస కోస ఇబ్బందులు, కరోనా లక్షణాలు ఉన్న వారు మహావీర్ ఆస్పత్రికి వెళ్లాలని మంత్రి కోరారు. ప్రజలు పూర్తి సంయమనం పాటించాలని కోరారు. వైద్య, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు బాగా పనిచేస్తున్నారనీ, వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి కలెక్టర్ వరకు, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు, ఎమ్మెల్యేలూ బాగా కష్టపడుతున్నారని వారందరి కృషి ఎంతో గొప్పదన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇంటింటికీ తిరిగి కరోనాపై వివరాలు సేకరిస్తున్నారనీ, చైతన్యం కల్పిస్తున్నారని ప్రశంసించారు.

ఢిల్లీలోని మార్కజ్‌లో జరిగిన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలనీ, ప్రభుత్వం వారికి ఉచితంగా వైద్యం చేస్తుందన్నారు.ప్రభుత్వం రోజుకు రూ.600 కోట్లు నష్ట పోతున్నా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోందన్నారు. భవిష్యత్ లో పొడిగింపు జరిగిన ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. ఉదయం పూట సరుకుల కోసం ఒకే సారి రాకుండా, ఒక సారి వచ్చినపుడు వారానికి సరిపడే సరుకులను తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ దిశ‌గా పోలీసు అధికారులను పెట్రోలింగ్‌కు పెంచాలని ఆదేశించారు.

రేషన్ కార్డుపై ప్రతి కార్డుకు 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయనీ, వాటి కోసం వెంటనే బ్యాంకుల వద్దకు వెళ్లొద్దనీ, అవసరం ఉన్న వాళ్లు మాత్రమే తీసుకోవాలని డబ్బులు ఎక్కడికి పోవనీ, ఎప్పుడైనా తీసుకోవచ్చని తెలిపారు. రోడ్ల‌పై ఉమ్మి వేయడంపై ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని అందరూ దానిని పాటించాలనీ, బయటకు వస్తే తప్పనిసరి‌గా మాస్క్ ధరించాలన్నారు.

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,34,983 రేషన్ కార్డుల‌పై 8 లక్షల పైచిలుకు మంది‌కి 96,91,212 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో గుర్తించిన 6,288 మంది వలస కార్మికులకు 12 కిలోల చొప్పున 75,456 టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో 62,449 రేషన్ కార్డులపై 2,05,090 మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో మొత్తం 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తారని మంత్రి తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు.

రాజీవ్ గృహ కల్ప‌లో మంత్రి పర్యటన

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప‌లో మంత్రి పర్యటించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్‌లతో కలిసి పర్యటించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, సామాజిక దూరం పాటించాలనీ, స్వీయ రక్షణ‌నే శ్రీరామ రక్ష అని ప్రజలకు తెలిపారు. గృహ కల్ప‌లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Tags: review meeting, covid 19, lockdown, stay home, minister sabitha indra reddy

Advertisement

Next Story