ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి

by  |
ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అధికారులతో సెల్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే సంబంధిత శాఖల అధికారులు స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్‌లలో 24 గంటలు పనిచేసేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను, మున్సిపాలిటీలలో భాగస్వాములను చేసి తమ పరిధిలో ఏవైనా పాత ఇళ్ళు వర్షాలకు దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఆ నివాసితులను దగ్గరలోని ప్రభుత్వ భవనాలకు, స్కూళ్లకు లేదా బంధువుల ఇళ్లకు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు నిరంతరం చెరువులు, కాలువలను పర్యవేక్షిస్తూ, కట్టలు తెగకుండా చూడాలని, ముందస్తుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. యూరియా సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు కింది స్థాయి సిబ్బంది వరకు అందరినీ అప్రమత్తం చేయాలని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని అన్నారు. రోడ్లను, కల్వర్టులను పర్యవేక్షిస్తూ వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed