జేసీ అక్రమాలపై చర్చకు సిద్ధం- పేర్ని నాని సవాల్

by srinivas |
జేసీ అక్రమాలపై చర్చకు సిద్ధం- పేర్ని నాని సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్, ఆయన కుటుంబం అక్రమాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టుల నేపథ్యంలో అమరావతిలో నాని మాట్లాడుతూ.. చంద్రబాబు వచ్చినా, లోకేశ్ వచ్చినా, ఇతర టీడీపీ సీనియర్లు వచ్చినా జగన్ ప్రభుత్వం మీడియా సమక్షంలో అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉందని అన్నారు. ఆ కుటుంబ సభ్యుల అక్రమాల గురించి జగన్ సర్కారు ఆధారాలతో సహా వివరించాలని నిర్ణయించుకుందని చెప్పారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2017 మార్చి 31 తర్వాత బీఎస్3 ప్రమాణాలతో వాహనాలను ఏ కంపెనీ కూడా తయారు చేయకూడదనీ, ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకూడదని గుర్తు చేశారు. ఇలా అశోక్ లేలాండ్ కంపెనీ వద్ద మిగిలిపోయిన 154 బీఎస్3 లారీ చాసిస్‌లను జేసీ కుటుంబసభ్యులు జటాధరా ఇండస్ట్రీస్, మెస్సర్స్ సి.గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట కొనుగోలు చేశారని ఆయన తెలిపారు.

జటాధరా ఇండస్ట్రీస్ కంపెనీలో జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని నాని వెల్లడించారు.

ఈ రెండు కంపెనీల ద్వారా 66 బీఎస్3 లారీ చాసిస్‌లు 2018లో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అయినట్టు సమాచారం ఉందని ఆయన చెప్పారు. ఈ చాసిస్ నెంబర్లు అశోక్ లేలాండ్ కంపెనీకి పంపిస్తే, ఆ 66 చాసిస్‌లలో 40 చాసిస్‌లను గోపాల్ రెడ్డి కంపెనీకి, 26 చాసిస్‌లను జటాధరా ఇండస్ట్రీస్‌కు తుక్కు ఇనుము (స్క్రాప్) కింద అమ్మినట్టు రిప్లే ఇచ్చారని వెల్లడించారు. ఈ వాహనాలన్నీ నాగాలాండ్‌లోని కోహిమాలో రిజిస్ట్రేషన్ అయినట్టు నిర్ధారించారణ జరిగిందని అన్నారు.

దీంతో ఈ తతంగంపై అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అనంతపురం పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు నాగాలాండ్‌లోని కోహిమా వెళ్లారు. అక్కడకి వెళితే 66 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు, ఎన్వోసీలతో సహా ఏపీ వచ్చాయని వెల్లడైందని తెలిపారు.

దీంతో వీటిపై ఆరాదీసేందుకు అనంతపురం పోలీసులు అశోక్ లేలాండ్ కంపెనీకి వెళ్తే అక్కడ వాస్తవానికి తాము విక్రయించింది కేవలం 66 చాసిస్‌లు కాదని, 154 చాసిస్‌లన్న వాస్తవం వెల్లడైందని పేర్ని నాని వెల్లడించారు.

దీంతో ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తే జేసీ అక్రమాలన్నీ బయటపడ్డాయని, దశలవారీగా చేతులు మారుతూ, తద్వారా డాక్యుమెంట్లు మారుతూ బీఎస్-4 వాహనాలుగా రూపాంతరం చెందాయని అన్నారు. లారీ చాసిస్‌లలో కొన్ని దివాకర్ ట్రావెల్స్ బస్సులుగా కూడా మారాయని వెల్లడించారు. రూపాయి కక్కుర్తి తప్పితే ప్రజల ప్రాణాలకు వీరిచ్చే విలువేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలేనని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని చంద్రబాబునాయుడు వెనకేసుకు వస్తున్నారని నాని మండిపడ్డారు.

Advertisement

Next Story