వంద జాకీలు పెట్టినా కాంగ్రెస్ లేవదు : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, ఆమనగల్లు: రాష్ట్ర అభివృద్ధికి కృషిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేయడం మాని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. గుండోడు, గుడ్లోడు, బండి, గింతంతోడు ఎగిరెగిరి పడి రాష్ర్ట ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏడేళ్ళుగా వారి విమర్శలను భరించామని, ఇక భరించలేమని హెచ్చరించారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని రైతువేదిక, వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సం, గ్రంథాలయ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిపై బంద్, నిరసనలు తెలుపడం కాదని, పెట్రోల్ రేట్లు పెంచిన మీ బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన హరిత విప్లవంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, పంజాబ్‌లో కేంద్రం ధాన్యాన్ని కొని ఇతర రాష్ట్రాల్లో కొనొద్దని లిఖిత పూర్వకంగా ఆదేశించడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

వంద జాకీలు పెట్టినా లేవని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని అవంతరాలు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేది కేసీఆరే అని వెల్లడించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని పార్టీలకతీతంగా ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాలలో ఎంపీ పోతుగంటి రాములు, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీలు అనురాధ, దశరథ్ నాయక్, విజితారెడ్డి, ఎంపీపీలు అనిత, సునిత, టీఆర్ఎస్ రాష్ర్ట నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed