తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట

by Shyam |
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని జగిత్యాలలో ఆవాల పంటపై అఖిల భారత పరిశోధన సమన్వయ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. ఐకార్ (జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి) ప్రాంతీయ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సహా వివిధ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రం తరుపున పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనిలో కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్రంలో నియంత్రిత సాగును ప్రోత్సహిస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న పంటలసాగు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

53లక్షల ఎకరాలలో వరి, దాదాపు 60లక్షల ఎకరాలలో పత్తి, 11లక్షల ఎకరాలలో కందితో పాటు ఆముదాలు, జొన్నలు, సోయాబీన్, వేరుశనగ సాగు చేశామన్నారు. ఈ వానాకాలం కోటీ 45లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయని, యాసంగిలో కూడా గతంకన్నా ఎక్కువ శాతం సాగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నాణ్యత కలిగిన అప్లాటాక్సిన్ రహిత వేరుశనగ పండించే వనపర్తి జిల్లాలో వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని, పత్తిలో అత్యధిక సాంద్రతతో పంట పండించేందుకు అఖిల భారత పరిశోధన సమన్వయ కేంద్రం వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. పెరిగిన సాగునీటి వసతుల దృష్ట్యా నీటి యాజమాన్యంపై పరిశోధన చేయటానికి రాజేంద్రనగర్‌లో అఖిల భారత సమన్వయ కేంద్రం ఏర్పాటు చేయాలని, నీటి వసతితో రైతులు రెండవ పత్తి పంట పండించేందుకు అవకాశాలను శాస్త్రవేత్తలు శోధించాల్సి ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed