‘యాసంగి నాటికి సమగ్ర వ్యవసాయ విధానం’

by Shyam |
‘యాసంగి నాటికి సమగ్ర వ్యవసాయ విధానం’
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ మూలంగా దేశం మొత్తం అతలాకుతలం అయ్యింది. దీని ప్రభావం అనేక రంగాలపై పడి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అష్టకష్టాలు పడ్డారు. దీనికి తోడు వర్షాలు పడటంతో పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వచ్చే యాసంగి నాటికి రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు‌పై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ముఖ్యమంత్రే స్వయానా తను ఉన్నంతవరకూ రైతుబంధు ఇస్తామని చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని దేవరకద్ర మండల కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ గోదామును, చిన్నచింతకుంట మండలం బండర్‌వల్లి గ్రామంలో రూ.3 కోట్లతో నిర్మించిన మార్కెట్ గోదామును మంత్రి ప్రారంభించారు. లాల్కోట గ్రామ సమీపంలోని బండ్రవల్లి వాగుపై సుమారు రూ.5 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు భూమి పూజ చేశారు. బండ్రవల్లి గ్రామంలో గోదాం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, ఇతరులతో కసరత్తు ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో సన్నవరి, కంది, వేరుశెనగ విస్తీర్ణం పెంపుదల, ఆయిల్ ఫామ్ తోటల పెంపకం తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని, అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా, వచ్చే యాసంగి నాటికి మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed