విద్యుత్ వాహన రంగానికే పెద్దపీట : మేకపాటి

దిశ, వెబ్‌డెస్క్ :

పర్యావరణానికి హానీ కలిగించని విద్యుత్ వాహన రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేయనుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడలోని కానూరులో బుధవారం ‘కైనెటిక్ గ్రీన్’ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వానితో మంత్రి అల్పాహార భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల మానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై వీరి మధ్యలో చర్చ జరిగిందని వివరించారు.

అంతేకాకుండా, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రీఛార్జ్ స్టేషన్లు నెలకొల్పడంపైనా కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ARAI(ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అప్రూవ్ చేసిన త్రి చక్ర విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా ఇప్పటికే ‘కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ’కి పేరుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)తో భాగస్వామ్యమైనట్లు మంత్రి మేకపాటికి ఆ కంపెనీ CEO సులజ్జ పేర్కొన్నారు. ఈ భేటీలో ‘గ్రీన్ కైనెటిక్’ సహ వ్యవస్థాపకులు, ఎండీ రితేష్‌తో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు.

Advertisement