పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు

by  |
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా సంక్షోభంలోనూ హైదరాబాద్ ఫార్మా రంగం తన బలాన్ని మరోసారి చాటుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం ప్రాధాన్యత, భవిష్యత్తు దిశానిర్ధేశంపై మంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం జీనోంవ్యాలీ, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్, అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో ప్రపంచంలోనే అగ్రగామి ఫార్మా డెస్టినేషన్‌గా నిలదొక్కుకుందని అన్నారు. ప్రపంచంలోని వ్యాక్సిన్లలో సుమారు 30శాతానికి పైగా హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకి గర్వకారణమన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రెండు దశాబ్దాల క్రితం దేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగానైతే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఒక అద్భుతమైన అవకాశంగా లభించిందో, అలాంటి పరిస్థితి ఈ రోజు ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో నెలకొందన్నారు. కేవలం కరోనా సంక్షోభంలో మాత్రమే కాకుండా తర్వాత కూడా ఫార్మా, లైఫ్ సైన్సు రంగంలో అనేక అవకాశాలు ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రంగంలో అంది వచ్చే భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలోని టాప్ ఫైవ్ కంపెనీలు ఏవిధంగా అయితే తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయో అదే విధంగా నోవార్టిస్ వంటి ఫార్మా దిగ్గజాలు సైతం హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

కేవలం మందుల తయారీకే కాకుండా భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో “మెడిసిన్స్ ఫ్రం ద స్కై” వంటి కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో చేపట్టి అత్యవసర సమయాల్లో డ్రోన్లతో మందులను సరఫరా చేసే అంశంపైన పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


Next Story