ఫైబర్ గ్రిడ్‌కు అప్పియ్యండి : కేటీఆర్

by  |
ఫైబర్ గ్రిడ్‌కు అప్పియ్యండి : కేటీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 500 గొడౌన్ల నిర్మాణం చేయాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని నాబార్డును పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. దీంతో పాటు గ్రామాల్లోని రైతు బంధు కమిటీలను మరింతగా ఫెడరేట్ చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, వీటి ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి అవసరమైన రుణాలను అందించే అంశంపై కూడా పరిశీలించాలని సూచించారు.ఈ అంశాలపై నాబార్డు సీజీఎం వైకే రావుతో కేటీఆర్ ప్రగతి భవన్‌లో శుక్రవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత అర్థిక వ్యవస్థ బలోపేతానికి, గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న (పెట్టుబడుల అవకాశాల బలోపేతానికి), ఇతర గ్రామీణ రుణ వ్యవస్థ బలోపేతానికి నాబార్డ్ పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డ్ కున్న అవకాశాలను వివరించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్న సాగునీటి ద్వారా ప్రస్తుతం వ్యవసాయోత్పత్తుల విప్లవం రానుందని, దీంతో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవకాశమున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. వీటి ఏర్పాటు కోసం నాబార్డ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు వీలు కలుగుతుందని, తద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాతిపదిక పైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ రుణసాయం అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సీజీఎంను కోరారు.

ఇప్పటికే నాబార్డ్ పాడి పశువుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా అనేక రుణాలు ఇస్తుందని, ఐతే ఏదైనా ఒక జిల్లాలో సంతృప్త స్థాయి (సాచ్యురేషణ్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. అవసరమైతే ఇందుకోసం తన సొంత జిల్లా సిరిసిల్లలో కార్యక్రమం చేపట్టేందుకు ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా గ్రామాల్లోని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి చేపడుతున్న అనేక కార్యక్రమాలు తమ బ్యాంకు లక్ష్యాలకు, స్పూర్తికి అనుగుణంగా ఉన్నాయని నాబార్డు సీజీఎం వై.కె రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచించిన సూచనలకు సానుకూలంగా స్పందించిన సీజీఎం తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed