దివాళా తీసింది కాంగ్రెస్సే.. తెలంగాణ కాదు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం ఏర్పాటు అయ్యాక దివాళా తీసింది కాంగ్రెస్ పార్టీయే తప్ప తెలంగాణ కాదని మున్సిపల్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. ప్రపంచంలో హైదరాబాద్ మోస్ట్ డైనమిక్ సిటీ అని జేఎల్ఎల్ అని చెబుతుంటే కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందన్నారు. హైదరాద్ అభివృద్ధి మొత్తం తామే చేసినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, 2014కు ముందు జలమండలి వద్ద ఖాళీ బిందెలతో ధర్నా చేసిన విషయాల్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం గాంధీ‌భవన్‌కు టూలెట్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భట్టి విక్రమార్క ఊకదంపుడు ఉపన్యాసం మానుకోవాలని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో 300బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని, రాజధానిలో ఇప్పటివరకు రూ.67,135కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉద్యోగుల వేతనాలతో కలిసి లక్ష కోట్లు దాటుతుందన్నారు. గతంలో హైదరాబాద్‌ ప్రజలు నీళ్లు, కరెంట్ కోసం అవస్థలు పడ్డారని.. కోటి మంది ఉండే నగరంలో కనీసం మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తే గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.5,683 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రూ.17వేల కోట్లతో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చామని, మహిళల కోసం 11వేల పైచిలుకు టాయిలెట్స్ నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 150 పబ్లిక్ టాయిలెట్స్ కూడా నిర్మించలేదన్నారు.

పట్టణ ప్రగతిలో 1000కి పైగా స్మృతివనాలు నిర్మించామని, ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్ అని కొనియాడారు. ప్రతీనెల జీహెచ్ఎంసీకి రూ.78కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70కోట్లు ఇస్తున్నామని, కొత్త మున్సిపల్ చట్టం ద్వారా అనుమతులను సులభతరం చేశామన్నారు. అన్ని పురపాలికల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. ప్రకృతి వైరీత్యాలను ఎదుర్కొనేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో డీఆర్ఎఫ్ బృందాలను మరిన్ని నగరాలకు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ పాత్ర కీలకమైనదని రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధికి రూ.67వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. 1952లో అంబేద్కర్‌ను పార్లమెంట్‌లోకి రాకుండా ఓడించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న అంబేద్కర్ స్ఫూర్తితోనే అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement