సిరిసిల్ల దశ మారనుంది : కేటీఆర్

by  |
సిరిసిల్ల దశ మారనుంది : కేటీఆర్
X

రైల్వే లైన్ రాకతో రాజన్న సిరిసిల్ల జిల్లా దశ దిశ మారనుందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టు కీలకంగా నిలవనుందన్నారు. రైల్వే‌లైన్‌కు అవసరమైన 845 ఎకరాల భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని మే నెలాఖరు నాటికి పూర్తి పూర్తి చేయాలన్నారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూసేకరణ అత్యంత పకడ్బందీగా సేకరించాలని సూచించారు. రైల్వే‌లైన్ అలైన్మెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. తంగళ్ళపల్లి రైల్వే స్టేషన్ కార్గో మూమెంట్, ఆక్వా‌హబ్‌లతో అనుసంధానించాలని అధికారులకు సూచించారు. అలాగే యుటిలిటీ షిఫ్టింగ్‌లను సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ధవలేశ్వరం మాదిరి మధ్య మానేరు జలాశయం బ్యాక్ వాటర్‌పై రోడ్డు కం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ వంతెనను రింగ్ రోడ్డు‌తో అనుసంధానం చేయాలని, భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైల్వే అధికారులకు అప్పగిస్తే 2022 నాటికి సిరిసిల్ల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చని మంత్రి వివరించారు.

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు అతిథిగృహంలో సిరిసిల్ల అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి గంటన్నర ప్రయాణంలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇక్కడ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. కాటేజీల నిర్మాణం, బోటింగ్ క్రీడలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని, అలాగే ఎగువ మానేరు జలాశయం అతిథి గృహాన్ని రూ.2కోట్లతో ఆధునీకరించాలని పంచాయతీరాజ్ అధికారులను మంత్రి ఆదేశించారు. అతిథి గృహం లోపలి భాగాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్నారు. అలాగే నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు. వచ్చే పది రోజుల్లో తాను మళ్లీ నర్మాలకు వస్తానని అప్పటికల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన, అతిథి గృహం ఆధునీకరణ పనులు, పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని మంత్రి అన్నారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.

మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన కేటీఆర్…

రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హుటాహుటిన హైదరాబాద్ కు వెల్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రివ్యూ మీటింగ్ తరవాత తంగళ్లపల్లి, సిరిసిల్లలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో కేటీఆర్ తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. నర్మాల అప్పర్ మానేరు డ్యాంలో రివ్యూ సమావేశం నుంచి నేరుగా మంత్రి హైదారాబాద్ కు వెళ్లారు.


Next Story

Most Viewed