ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదు: జగదీశ్ రెడ్డి

by Shyam |
MInistar Jagadish reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిందని, తెలంగాణలో విద్యుత్ సుంకాన్ని పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానమిస్తూ.. కొవిడ్ సమయంలో విద్యుత్ శాఖపై రూ.నాలుగు వేల కోట్ల భారం పడిందని తెలిపారు. కొవిడ్ సందర్భంగా బిల్లులలో అవకతవకలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ అందులో ఎంత మాత్రం నిజం లేదని, కేవలం సాంకేతిక లోపంతో మాత్రమే అక్కడక్కడా వినియోగదారులు అయోమయానికి గురయ్యారని ఆయన తేల్చిచెప్పారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధిస్తోందని, ప్రజలను గందరగోళానికి గురిచేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయొద్దని ఆయన సూచించారు. కొవిడ్ సందర్భంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందించడమే కాకుండా బిల్లుల చెల్లింపునకు వాయిదా పద్ధతిలో అవకాశమిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వమంటే గిట్టని వారు కొందరు గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందని ఆయన చెప్పారు. డిస్కమ్స్ అప్పులపై స్పందించిన మంత్రి ప్రస్తుతం రూ.2890.27 కోట్ల అప్పు ఉందని అన్నారు. కాగా 2021-22 బడ్జెట్ లో విద్యుత్ శాఖకు రూ.పదివేల కోట్లు కేటాయించారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed