గుండెల నిండా ఆచార్య జ‌యశంక‌ర్ సార్ : మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

by Shyam |
Minister Indra Reddy
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ స‌ర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను అనేక వేదికల ద్వారా త‌న గ‌ళాన్ని వినిపించార‌ని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జ‌య‌శంక‌ర్ స‌ర్ జీవితాంతం కృషి చేశార‌ని ఆయ‌న సేవ‌ల‌ను స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ‌ రాష్ట్ర సాధనకు ఆయ‌న‌ ఆయువుపట్టు అయినార‌ని, తెలంగాణ ప్రజ‌ల హృదయాలలో ప్రొఫెసర్ జయశంకర్ స‌ర్‌గా ఎప్పటికీ నిలిచి ఉంటార‌ని పేర్కొన్నారు.

ఆచార్య జయశంకర్ సర్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ.. ఆయ‌న ఆశ‌య‌సాధ‌న‌కు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. జయశంకర్ స‌ర్‌పై ఉన్న ఎన‌లేని గౌర‌వంతో వ్యవ‌సాయ యూనివ‌ర్సీటికీ ఆయ‌న పేరు పెట్టారని చెప్పారు. వెలి వాడ‌ల్లో ఉంటున్న దళితుల అభ్యున్నతికి ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టి వారికి అండ‌గా నిలుస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క‌లెక్టర్ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, మున్సిప‌ల్ చైర్మన్ గండ్రత ఈశ్వర్, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేంద‌ర్, త‌దత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed