అపోహలు తొలగించి… విశ్వాసం కల్పించాలి

by  |
అపోహలు తొలగించి… విశ్వాసం కల్పించాలి
X

దిశ ప్రతినిధి, మెదక్: ఆన్ లైన్ క్లాసులు నిర్వహణపై ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక కేర్ టీచర్ ఉండాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆన్ లైను క్లాసులు జరపాలని మంత్రి హరీశ్ రావు ఉపాధ్యాయులకు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యేక ఆన్ లైన్ తరగతులు ప్రారంభం నేపథ్యంలో ఉమ్మడి సిద్ధిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తరగతుల నిర్వాహణపై ఉన్నత, మండల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్ లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలు, అప నమ్మకాలను తొలగించి విశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.

ఏ విద్యార్థీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులదేనని, బడీడు పిల్లలంతా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు చూడాలని, ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ బృందాలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి జిల్లాలైన సిద్ధిపేట, మెదక్ పరిధిలోని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధా కృష్ణ శర్మ, ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేలు, సిద్ధిపేట, మెదక్ జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, డీఈఓ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed