టార్గెట్ దుబ్బాక

by  |
టార్గెట్ దుబ్బాక
X

దిశ, దుబ్బాక: ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోవైపు మంత్రి హరీశ్‌రావు.. ఇంకోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్ పెద్దలంతా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల మధ్య ఉన్న దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించుకుంటారన్న గుర్తింపు ఉన్న హరీశ్‌రావు ఇప్పుడు అక్కడ సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

గత పది రోజులుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాల ప్రదానోత్సవాలు.. లాంటి వాటితో హరీశ్‌రావు హడావిడి కార్యక్రమాలు ఎందుకు పెట్టుకున్నారు? గతంకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యమా? లేక ఉప ఎన్నికలో ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయేమోనన్న అనుమానమా? టీఆర్ఎస్ టికెట్ ఎవరికనేది ఖరారు కాకపోయినా రామలింగారెడ్డి కుమారుడి వీడియో వైరల్ కావడంతో అది పార్టీ విజయానికి ఎలాంటి చేటు తెస్తుందోననే సందేహమూ పార్టీకి లేకపోలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకస్మిక మృతితో ఓటర్ల సానుభూతి ఎలాగూ ఉంటుంది. అదే సమయంలో పలుమార్లు ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన బీజేపీ నాయకుడు రఘునందన్‌రావు సైతం ఆ తరహా సానుభూతిపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారు. దీనికి తోడు దుబ్బాక నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా రఘునందన్‌రావుకు కలిసొచ్చే అంశం. ఎన్నికల సంఘం నుంచి షెడ్యూలు, నోటిఫికేషన్ వెలువడనే లేదు గానీ టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల ప్రచారం మాత్రం చాలా ముందుగానే ప్రారంభమైంది.

గ్రామాల్లో టీఆర్ఎస్ నేతల మోహరింపు

అధికార పార్టీ ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేలను, ముఖ్యులను మోహరించింది. అన్ని మండలాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను ఇన్‌చార్జులుగా నియమించింది. దుబ్బాక మండలానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, చేగుంట మండలానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నార్సింగి మండలానికి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, తొగుట మండలానికి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, రాయపోల్ మండలానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దౌల్తాబాద్ మండలానికి ఎడీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మిరుదొడ్డి మండలానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీల కౌన్సిలర్లతో పాటు సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల సర్పంచులు, పక్కనే ఉన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీర్‌రావుపేట మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులకు గ్రామాలవారీ బాధ్యతలను అప్పగించింది. గ్రామాల్లో అసమ్మతులను బుజ్జగించే పనిలో పడ్డారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా సర్పంచులకు ఫోన్‌ చేస్తున్నారు.

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల.. మధ్యలో దుబ్బాక

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు లేదనే చర్చ ఇప్పుడు నియోజకవర్గ ప్రజల మధ్య జోరుగా నడుస్తోంది. సిద్దిపేట మోడల్ నియోజక వర్గంగా మారుతూ ఉంటే అక్కడి చెత్తా చెదారాన్ని డంప్ చేసే యార్డుగా దుబ్బాక మారిపోయిందంటూ ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందుకే బలమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గాల మధ్య ఉన్న దుబ్బాక ప్రజలు ఇప్పుడు భిన్నమైన నాయకత్వం కోసం చూస్తున్నారని టీఆర్ఎస్ పసిగట్టింది. ఈ కారణంగానే హరీశ్‌రావు దుబ్బాకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సరిగ్గా బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేసుకుంటోంది. అభివృద్ధి అంశమే ఈ ఉప ఎన్నికలో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది.

80 శాతం గ్రామాల్లో బీజేపీ ప్రచారం పూర్తి

దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ సైతం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేత రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం చేస్తూ దాదాపు ఇప్పటికే ప్రతీ గడపనూ చుట్టేశారు. నియోజకవర్గంలోని సుమారు 80 శాతం గ్రామాల్లో ప్రచారం ఇప్పటికే పూర్తి చేశారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఫార్ములానే ఇక్కడ కూడా అవలంభిస్తున్నారు. యువతను రంగంలోకి దింపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు, పార్టీ శ్రేణులు, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న కత్తి కార్తీక గ్రామాలను చుట్టేస్తున్నారు. కుల సంఘాల నాయకులను, వివిధ వర్గాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. యువకులతో సెల్ఫీలు దిగి హల్‌చల్ చేస్తున్నారు. ఆదరించాల్సిందిగా కోరుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ తరపున శ్రావణ్‌రెడ్డి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర పీసీసీ ఇన్‌ఛార్జి దిశా నిర్దేశం మేరకు సోమవారం నుంచి కాంగ్రెస్ శ్రేణులు కూడా దుబ్బాకలో మోహరించనున్నాయి.

మారుతున్న రాజకీయ పరిణామాలు

రామలింగారెడ్డి మరణం తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే సమర్థవంతమైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్న మాట ఓటర్లలో వినిపిస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యక్తిగా వివాద రహితుడైనప్పటికీ ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారనే మాటలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో సానుభూతి రాకపోవడానికి అదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ 2015లో దుబ్బాకలో పర్యటించి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవటం ఆ పార్టీపైన ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజాఉమ్మారెడ్డి సంస్థానంలో వెలుగు వెలిగిన దుబ్బాక ఉనికి క్రమంగా తగ్గిపోయి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావడం ప్రజల్లో అసంతృప్తికి ఒక కారణం. దుబ్బాకలో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్ రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారనే అసంతృప్తి ఉంది. ఆరేండ్ల పాటు దుబ్బాకలో కేసీఆర్ చదువుకున్న బడి నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చినా దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి ఇంకా కలగానే మిగలిపోవడం, మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం.. ఇవన్నీ ఇప్పుడు ప్రజల మధ్య వినిపించే గుసగుసలు. రానున్న రోజుల్లో రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed