ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : ఈటల

by  |
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : ఈటల
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా చికిత్సలో వాడే అతి సాధారణ ఔషధాలకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చవుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పేషంట్‌కు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తే రోజుకు గరిష్టంగా రూ.2,500 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలపై మంత్రి ఈటల మంగళవారం సాయంత్రం మీడీయాతో మాట్లాడారు. కరోనాకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే రకమైన చికిత్స అందిస్తారన్న మంత్రి, వారం రోజులు దవాఖానాలో ఉన్నా రూ.10వేలకు మించి ఖర్చవదన్నారు. అయితే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రూ.లక్ష నుంచి 10లక్షల వరకూ బిల్లులు వసూలు చేశాయన్నారు. ప్రస్తుతమున్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితని, కార్పొరేట్ ఆస్పత్రులు గతంలో మాదిరిగా వ్యాపారం ధోరణితో వ్యవహరించొద్దని విన్నవించారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా హాస్పిటల్స్‌పై విచారణకు కమిటీని వేశామని, ఇప్పటికే ఒక ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నామని, రిపోర్టు రాగానే మరికొన్ని ఆస్పత్రులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రాన్ని 1,400 వెంటిలేటర్లు కావాలని కోరితే 750 వరకూ మాత్రమే అందించిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనాకు చికిత్స

రాష్ట్రంలో పీహెచ్‌సీల నుంచి గాంధీ ఆస్పత్రి వరకూ ఎక్కడికక్కడ కరోనా చికిత్స అందిస్తున్నామని ఈటల వివరించారు. రాష్ట్రమంతటా కరోనాకు అవసరమైన చికిత్స అందుబాటులో ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. 108, 104 సర్వీసుల సంఖ్యను పెంచుకుని, ప్రజలకు లోకల్ ఏరియాలోనే కరోనా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా కంటే భయంకరమైన వైరస్‌లను మానవాళి చూసిందని, ఇది అంత పెద్ద వైరస్ కాకపోయినా మానవ సంబంధాలను దెబ్బతీసిందని వివరించారు. వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు, వంటి నొప్పులు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు సాధారణంగా వస్తాయని, అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి రావాలని, కరోనా నిర్థారణ కాకపోయినా ఆస్పత్రిలో చేర్చుకుంటారని స్పష్టం చేశారు. ఇతర అనారోగ్య సమస్యలున్నపుడు చికిత్స అందిస్తారని, ఇన్ పేషంట్‌‌గా చేర్చుకున్న తర్వాతే కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని సూచించారు. అన్నిరకాల ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఔషధాలు, బెడ్స్ కొరత లేదని తెలిపారు. జిల్లాల్లో అవసరమైన అదనపు వైద్య సదుపాయాల కోసం స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఆస్పత్రులను వినియోగించుకుంటున్నామన్నారు. గాంధీ ఆస్పత్రిలో వెయ్యి వరకూ వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని, మరో 350 బెడ్లను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. ‘ హితం’ యాప్ ద్వారా 70మంది విశ్రాంత వైద్య నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తున్నారని, ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు.


Next Story