‘రెచ్చగొడుతున్నారు.. తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ రాస్తాం’

by srinivas |
‘రెచ్చగొడుతున్నారు.. తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ రాస్తాం’
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదన్నారు. ‘సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అసవరమైతే ఎంతదూరమైనా వెళ్తాం. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు?. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దాం. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదు. మా సంయమనం చేతకాని తనం కాదు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోంది’ అని మండిపడ్డారు. తెలంగాణ తీరుపై బుధవారంనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జల్‌శక్తి మంత్రికి లేఖ రాస్తున్నట్లు మంత్రి అనిల్ వెల్లడించారు.

Advertisement

Next Story