సింహంలా సింగిల్‌గా వస్తాం.. టీడీపీకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్

by srinivas |
anil kumar
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా హీటెక్కిస్తోంది. నువ్వా నేనా అన్నరీతిలో ఈ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో మెుదటి నుంచి ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నామినేషన్లు వరకు మెుత్తం దగ్గర ఉండి చూసుకున్నారు. అంతేకాదు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను సైతం తన భుజాలపైనే వేసుకున్నారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలకు చివరి తేదీ కావడంతో రాజకీయంగా వేడెక్కింది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్పొరేషన్‌లో గెలవలేక, అభ్యర్థులు దొరక్క.. అనైతిక పొత్తులు పెట్టుకుంటుందని ధ్వజమెత్తారు. సీపీఎం, సీపీఐ, జనసేన, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కూడా కలుపుకుని పోటీకి వస్తే తాము సింహంలా సింగిల్‌‌గా వస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్ని పార్టీలతో అనైతిక పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగినా తాము మాత్రం ఒంటరిగా వస్తామని ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటామని సవాల్ విసిరారు.

మరోవైపు సీపీఎం,సీపీఐ, జనసేన మిత్రపక్షాలతో టీడీపీకి బేరసారాలు కుదరలేదని అందుకే పొత్తు విచ్ఛిన్నమైందని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఒక్క కాంగ్రెస్ పార్టీని వదిలేశారని ఆ పార్టీని కూడా కలుపుకుని మొత్తం కట్టకట్టుకుని వస్తే ఎన్నికల బరిలో తాడోపేడో తేల్చుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

Advertisement

Next Story