‘పోడు భూముల‌కు ప‌ట్టాలివ్వాలి.. ఖ‌నిజ సంప‌దే అడ‌వుల‌కు శాప‌మైంది’

by Shyam |
‘పోడు భూముల‌కు ప‌ట్టాలివ్వాలి.. ఖ‌నిజ సంప‌దే అడ‌వుల‌కు శాప‌మైంది’
X

దిశ‌, హ‌స‌న్‌ప‌ర్తి : సాగులో ఉన్న వ్యవసాయ, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సోమ‌వారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో హ‌న్మకొండ జిల్లా అటవీ శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వినతి పత్రాన్ని అందజేసిన అనంత‌రం రాములు మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపేదలు, దళితులు, ఆదివాసీ గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. గిరిజన సమాజానికి అండగా ఉండాల్సిన అవసరం ప్రస్తుతం మరింతగా ఉందన్నారు. సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ ఖనిజ వనరులు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నాయ‌న్నారు. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయ‌న్నారు. బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ కాంట్రాక్టు శక్తులు, ఎలాగైనా గిరిజనులను అటవీ నుండి వెలివేసి, వారి జీవనోపాదైన పోడు వ్యవసాయంపై, అటవీ ఉత్పత్తులపై దెబ్బకొడుతున్నాయ‌ని అన్నారు. బడా కార్పొరేట్ శక్తులు, లక్షలాది కోట్ల విలువైన సంపదను, దోచుకోవాలని కుట్రలు జరుగుతున్నాయ‌న్నారు.

ఈ కుట్రలకు వ్యతిరేకంగా అటవీ సంపదపై అన్ని విధాలా హక్కులు కలిగిన ఆదివాసి గిరిజనులకు అండగా ఉన్నా 2006 ఆదివాసి అటవీ హక్కుల చట్టన్ని అలాగే మిగతా చట్టాలను అమలు పరచాలన్నారు. అటవినీ కాపాడుకునేందుకు వ్యవసాయానికి హక్కులు వచ్చే వరకూ నిరంతరం పోరాడుతున్న గిరిజన సమాజానికి అండగా నిలబడాలన్నారు. ప్రభుత్వ పథకాలు కూడా వీరికి అందడం లేదని, రైతుబంధు, రైతు బీమా, పంట రుణాలు, రుణమాఫీ అమలు కావడం లేదు పంటలు అమ్ముకునే సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోడు సాగు దారులపై నిర్బంధాన్ని నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. 2006 ఆదివాసి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రవి, గబ్బేట సతీష్, గోల్కొండ కుమార్, జూకంటి పద్మ, నవరత్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed