- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణాలు తగ్గాయ్.. ఖర్చులు పెరిగాయ్
లాక్‌డౌన్‌లో మధ్యతరగతి అనుభవాలు
దిశ, న్యూస్ బ్యూరో :
లాక్‌డౌన్‌తో మధ్యతరగతి, ఉద్యోగ కుటుంబాలన్నీ ఇండ్లకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్ కాలంలో పిల్లలు, పెద్దలు.. అందరూ ఇండ్లల్లోనే ఉండటంతో సాధారణంగా ఖర్చులు తగ్గిపోతాయని భావిస్తుంటాం. ప్రభుత్వం కూడా కొన్ని చెల్లింపులకు మినహాయింపులిచ్చినట్టు ప్రకటించడంతో ఊరట కలిగి ఈ నెల రోజుల్లో ఎంతోకొంత ఆదా అవుతుందని లెక్కలు కూడా వేసుకునే ఉంటాం. కానీ ఆ లెక్కలన్నీ చిత్తయ్యి.. మధ్య తరగతి కుటుంబాల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నగరంలో పెరుగుతున్న ఖర్చులను తప్పించుకునేందుకు కొన్ని కుటుంబాలు గ్రామాలకు కూడా వెళ్లిపోగా.. వెళ్లేందుకు అవకాశం లేని వాళ్లు నగరంలోనే ఖర్చులతో తిప్పలు పడుతున్నారు. కాగా, లాక్‌డౌన్ రోజుల్లో కొన్ని కుటుంబాల అనుభవాలు ఇలా ఉన్నాయి..
ఏడాది క్రితమే రాజశేఖర్, వాణిలకు వివాహమైంది. కొత్త జంట ఉప్పల్‌లో కాపురం పెట్టింది. లాక్‌డౌన్‌కు ముందు తరచూ బంధువుల ఇండ్లకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణ ఖర్చులు ఎక్కవయ్యేవి. ప్రస్తుతం ప్రయాణాలు, ప్రయాణ ఖర్చులు లేకపోయినా.. ఇంట్లో నిత్యావసరాలకు ఖర్చు పెరిగింది. పాలు, పెరుగు, చక్కెర, నూనె ఇలా అన్ని ధరలు పెరిగాయి. కొత్త రేషన్ కార్డు కూడా రాలేదు. బియ్యం కూడా సూపర్ మార్కెట్లలో కొనుక్కోవాలి. 25 కిలోల బస్తాకు నెల రోజుల్లో రూ.150 వరకు ధర పెరిగింది. గతంలో సినిమాలు, హోటళ్లకు వెళ్లేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే బిర్యానీ చేసుకుని తింటున్నారు. అందుకు కావలసిన వస్తువుల రేట్లూ పెరిగాయి. సినిమా టికెట్లకు పెట్టే డబ్బులను డీటీహెచ్ రీచార్జ్‌లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కేటాయిస్తుండగా.. గతంలో రూ.180 ఉన్న డీటీహెచ్ రీచార్జి, ఇప్పుడు రూ. 280కి పెరిగింది. అమెజాన్ ప్రైమ్ కోసం మరో రూ.300 చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఇంట్లోనే ఉంటున్నా.. ఖర్చులు తగ్గకపోగా ఇంకొంచెం ఎక్కువే అవుతున్నాయి. పైగా ఉద్యోగాలు లేక రూమ్ కిరాయి, ఇంటి ఖర్చులు, ఇతర అవసరాల కోసం కష్టపడాల్సి వస్తోందని ఈ కొత్త జంట చెబుతున్నారు.
ప్రైవేట్ ఉద్యోగుల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఓ జంట లాక్‌డౌన్ రోజుల్లో కుటుంబ కష్టాలు మరింత పెరిగాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇస్తామని ప్రకటించడంతో.. ఈఎంఐ చెల్లింపులు, ఇంటి ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ‘ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆరుగురు సభ్యులు ఇంట్లోనే ఉంటుండంతో తిండి ఖర్చులు పెరుగుతున్నాయి. గతంలో నెలకు రూ.30 వేలు ఇంటి లోన్‌తో కలుపుకుని రూ.50 వేల వరకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉండేది. లాక్‌డౌన్ విధించినా కూడా ఈఎంఐలు చెల్లించక తప్పడం లేదు. ఆర్‌బీఐ విధించిన మారటోరియం ఉపయోగించుకుంటే ఏడాది కాలం ఈఎంఐ ఎక్కువగా చెల్లించాల్సి రావడమే గాక.. వడ్డీ భారాన్ని తట్టుకోవడం కష్టమని’ చెబుతున్నారు. ‘ఈఎంఐల చెల్లింపు కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేయాల్సి వస్తోంది. క్రెడిట్ కార్డు బిల్లులను కూడా తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒకవేళ మారటోరియం ఉపయోగించుకుంటే రూ.5 వరకు వడ్డీ చెల్లించాలి. బ్యాంకు లోన్ తీసుకుని క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా రూ.2 వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అసలుకు మినహాయింపు లేకపోయినా వడ్డీ వసూలు చేయకుంటే కొంత వెసులుబాటు కలుగుతుందని’ ఈ మధ్యతరగతి ఉద్యోగస్తుల జంట కోరుతోంది.
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వీరాస్వామికి ఇద్దరు పిల్లలు. పాప ఏడో తరగతి, బాబు ఐదో తరగతి. ఇద్దరూ ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. స్కూల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీరాస్వామి చెబుతున్న ప్రకారం.. ప్రైవేటు స్కూళ్లలో ప్రతీ నెల ఫీజు వసూలు చేసే పద్ధతి లేదు. టర్మ్ ఫీజు రూపంలో రెండు, మూడు విడతల్లో కలిపి ఏడాది ఫీజులను ఇప్పటికే వసూలు చేసుకున్నాయి. వాళ్లు వెనక్కి ఇచ్చేది లేదు. ఒక వేళ చెల్లించకపోయినా.. టీసీ తీసుకుందామనుకున్నా బాకీ ఉన్న ఫీజులు వసూలు చేయకుండా ప్రైవేటు స్కూళ్లు ఊరుకోవు. స్కూల్‌కు వెళ్లినపుడు పిల్లలకు సాయంత్ర స్నాక్స్ తినడం అలవాటు. ఇప్పుడు కూడా స్నాక్స్ తింటున్నారు. అయితే రోజులో ఒక్కసారి కాదు.. ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ అందుబాటులో ఉండాల్సిందే.. గతంలో నెలకు మూడు ఆయిల్ ప్యాకెట్లు అయిపోయే కుటుంబంలో.. ఇప్పుడు ఐదు ప్యాకెట్లు అయిపోతున్నాయి. వారంలో ఎప్పుడైనా బేకరీ వెళ్లడమో.. ఇంకెప్పుడైనా కుటుంబంతో పాటు బయట లంచ్ లేదా డిన్నర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండటంతో రోజుకో కొంత వంటకం చేస్తున్నారు. బిర్యానీ, చపాతీలతో పాటు రకరకాల పిండి వంటలు, ఇతర స్నాక్స్ తయారు చేస్తున్నారు. అందరూ ఇంట్లోనే ఉండి తినడం తప్ప ఆదాయం లేకపోవడంతో లాక్‌డౌన్ రోజుల్లో ఖర్చులు పెరుగుతున్నాయని వీరాస్వామి చెబుతున్నాడు.
ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే శ్రీశైలం ఎల్‌బీ నగర్‌లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. ప్రతిరోజూ ఫీల్డ్‌లో తిరుగుతూ కంపెనీ అప్పులు వసూలు చేయడం, కొత్త కస్టమర్లను తీసుకురావడమే డ్యూటీ. లాక్‌డౌన్ రోజుల్లో డ్యూటీ లేకపోవడంతో దాదాపు నెలన్నర రోజులుగా జీతం ఇవ్వడం లేదు. నెలకు రూ.15 వేల జీతంతో పాటు కమీషన్లు వస్తుండేవి. మొత్తం నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఇద్దరు పిల్లలు ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్నారు. నెలకు రూ.5 వేలు చిట్టీలకు, మరో రూ.5 వేలు రూం కిరాయికి పోతుండేది. మిగిలిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించుకునేవారు. చిన్న పిల్లలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుండటం, గతంలో బయట కొనుక్కున్న తిండి పదార్థాల కోసం మారాం చేస్తుండటంతో వంట చేసిపెట్టడమో లేక పిల్లలకు రెండు దెబ్బలు తగిలించడమో చేయాల్సి వస్తోంది. ‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచక, మరో వైపు పిల్లలు మారాం చేస్తుంటే ఏమీ పాలుపోక కుటుంబాన్ని తీసుకుని ఏప్రిల్ చివరి వారంలో గ్రామానికి చేరుకున్నాడు. సొంత గ్రామంలో సిటీలో మాదిరిగా అన్ని వస్తువులు అందుబాటులో ఉండవు. కొనాలనుకున్న వాటికి కూడా వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంటున్నట్టు శ్రీశైలం తన అనుభవాన్ని వెల్లడించాడు.
Tags: Hyderabad, Lockdown, corona, middle class family, Expandature, Telangana