LRSపై పునరాలోచించండి..!

by  |
LRSపై పునరాలోచించండి..!
X

దిశ, న్యూస్ బ్యూరో : ఉద్యోగ విరమణ చేసిన కాచరాజు జైప్రకాశ్ ఒక ప్లాటును కొనుగోలు చేశారు. అవసరమైన సమయంలో తన ఆర్థికావసరాలు తీర్చుతుందని భావించారు. ఇప్పుడా ప్లాటుకు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ ప్రభుత్వం జీఓ 131 జారీచేసింది. దీంతో ఆయన అవాక్కయ్యారు. ఎల్ఆర్ఎస్ రుసుం మోయలేనంతగా ఉంది. అప్పు చేయక తప్పదని ఆయన వాపోతున్నారు. ప్రస్తుత తరుణంలో అప్పు కూడా ఎవ్వరూ ఇవ్వలేని పరిస్థితి. ఇది ఒక్క జైప్రకాశ్ సమస్యే కాదు.. వందలాది మంది ఇలా ప్లాట్లు కొని ఇలా ఆవేదన చెందుతున్నారు. ఎల్ఆర్ఎస్ రుసుం తగ్గించాలి లేదా యథావిధిగా రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని వారంతా కోరుతున్నారు. అలా కాకుంటే భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎల్ఆర్ఎస్‌ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఇఓగా ఉద్యోగ విరమణ చేసిన రవివర్ధన్, రిటైర్డ్ టీచర్ మోహన్‌ కూడా ఎల్ఆర్ఎస్ సహేతుకమైనది కాదని అంటున్నారు.

ఇదెలా సమంజసం?

చట్టాలను అమలు పరచడంలో విఫలమైన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ తీసుకు వచ్చిందంటూ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019 సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చిన కొత్త మునిసిప ల్ చట్టాన్ని సాకుగా చూపించి 11 నెలల తర్వాత ప్రజలను బాధ్యులను చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించడంలో బాధ్య తారాహిత్యంగా వ్యవహరించిన పంచాయతీ, మున్సిపల్ సంస్థల అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని విస్మరించి ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేడయంపై మండిపడుతున్నారు. అక్రమ లే ఔట్లను నియంత్రించాలని జీఓ 67లోని లేఅవుట్ రూల్స్‌లో 12(1) ఎ,బి,సి,(2), సెక్షన్ 13(2)లో స్పష్టమైన ఆదేశాలున్నా స్థానిక సంస్థలు వాటిని అమలు చేయకుండా, అక్రమ కట్టడాలను విచ్చ లవిడిగా ప్రోత్సహించారనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. అక్రమ లే ఔట్లపై చర్యలు తీసుకోని పక్షంలో స్థానిక సంస్థల ఎగ్జిక్యూటివ్ అథారిటీపై చర్యలుంటాయని జిఓ 67 సెక్షన్ 12లోని ఉపసెక్షన్ 2 స్పష్టం చేసింది. అయినా ఏ ఒక్కరిపై చర్యలు లేవని అంటున్నారు. వారిని వదిలేసి, రియల్టర్లను ప్రక్కనబెట్టి, ప్రజలను బాధ్యులను చేయడం అన్యాయమని అంటున్నారు.

యథేచ్ఛగా వెంచర్లు..

యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఎటుచూసినా 6 కి.మీ.ల వరకు లే ఔట్లు వందలాదిగా వెలిశాయి. వాటిని రియల్టర్లు బహిరంగంగా మార్కెట్ చేశారు. అక్కడ స్థానిక సంస్థతో పాటు, వైటీడీఏ కూడా ఉంది. అయినా, లే ఔట్ల ఏర్పాటు కొనగసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ చాలా ప్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. నియమాలను అతిక్రమించి ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలను గుప్పించారు. హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతంలోనూ వందలాదిగా అక్రమ లే ఔట్లు వెలిశాయి. వాటిలో వేలాదిగా ప్లాట్లు అమ్ముడుపోయాయి. అమాయక ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేశారు. రియల్టర్లపై చర్యలు లేకుండా, కొన్నవారే ఎల్ఆర్ఎస్ చేసుకోవాలనడం ప్రజలపై ప్రభుత్వానికున్న వివక్షను వెల్లడిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed