ఎవరెస్ట్ శిఖరం మీద మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్!

by Harish |
ఎవరెస్ట్ శిఖరం మీద మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కొన మీద మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 8850 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరం కొన మీద చిన్న ప్లాస్టిక్ ఫైబర్‌లు కనిపించినట్లు అక్కడ ట్రెక్కింగ్ చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బాల్కనీ అనే ప్రదేశంలో ఎక్కువ ప్లాస్టిక్ దొరికిందని, మొత్తంగా 5300 మీటర్ల నుంచి 8440 మీటర్ల మధ్య ఎత్తులో 11 ప్రదేశాల్లో మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించినట్లు వారు నిర్ధారించారు. అలాగే శిఖరాన్ని అధిరోహించే వాళ్లు, ట్రెక్కింగ్ చేసే వాళ్లు ఉండే బేస్ క్యాంప్‌లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ దొరికిందని ఈ పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ పరిశోధకుడు ఇమోజెన్ నేపర్ వెల్లడించారు.

దుస్తులు, టెంట్‌లు, తాళ్లలోని ఫైబర్‌ల నుంచి ఈ మైక్రోప్లాస్టిక్ వచ్చి ఉంటుందని ఆయన అన్నారు. వారు సేకరించిన ప్రతి మంచు ముద్దలోనూ మైక్రోప్లాస్టిక్ జాడలు ఉండటాన్ని బట్టి అక్కడ కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉందని అంచనా వేయొచ్చని ఆయన అన్నారు. అలాగే 2018లో పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన మరియానా ట్రెంచ్‌లో కూడా ప్లాస్టిక్ ఉందని గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన చూస్తే, అత్యంత లోతైన చోటు నుంచి అత్యంత ఎత్తైన చోటు వరకు అన్నిటినీ కలుషితం చేయడంలో మానవులు విజయం సాధించారన్నమాట!

Advertisement

Next Story

Most Viewed