రెండో టెస్టు నుంచి ఆర్చర్ అవుట్

by Shyam |
రెండో టెస్టు నుంచి ఆర్చర్ అవుట్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో బయో బబుల్ సృష్టించి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విజయవంతంగా నిర్వహించింది. తొలి టెస్టులో గెలిచింది విండీస్ కాదని, యావత్ క్రికెట్ ప్రపంచమే విజయం సాధించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఇక ఆటగాళ్లయితే బయో సెక్యూర్ నిబంధనలను పాటిస్తూ కుటుంబాలకు దూరంగా ఉండాలని చెప్పారు. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు 15 రోజులపాటు ఆటగాళ్లు క్యారంటైన్‌లో ఉన్నారు. సిరీస్ ముగిసే వరకు బయో బబుల్ పరిధిలోనే ఉండాలని అందరికీ ముందే చెప్పారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిబంధనలు ఉల్లంఘించాడు. మొదటి టెస్ట్ అనంతరం సౌతాంప్టన్ నుంచి 100 మైళ్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని విండీస్ మాజీ క్రికెటర్ మైఖెల్ హోల్డింగ్ తప్పు పట్టారు. ఆటగాళ్లతోపాటు సిబ్బంది అంతా బయోబబుల్‌లో ఉంటే ఆర్చర్ ఎలా బయటకు వెళ్తాడని ప్రశ్నించాడు. తప్పు తెలుసుకున్న ఈసీబీ ఆర్చర్‌పై వేటు వేసింది. గురువారం నుంచి ఓల్డ్ ట్రాఫోర్ట్‌లో జరుగుతున్న మ్యాచ్ నుంచి ఆర్చర్‌ను తప్పించింది. అతను ఎప్పుడూ సొంత కారులో తిరుగుతున్నాడని, ఇంగ్లండ్ ఆటగాళ్లు కొవిడ్-19 నెగెటివ్‌గా నిర్ధారణ అయినా ఒకే బస్సులో వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రతిసారి ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని హోల్డర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story