ట్రైన్ ప్రయాణికులకు కేంద్రం సూచనలు

by Shamantha N |
ట్రైన్ ప్రయాణికులకు కేంద్రం సూచనలు
X

న్యూఢిల్లీ: రేపటి నుంచి ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత 15 జతల ట్రైన్‌లు పట్టాలెక్కనున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్‌ల కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే టికెట్‌లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచే ట్రైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటించిన రైల్వేస్.. వెబ్‌సైట్‌లో అసౌకర్యం తలెత్తడంతో సాయంత్రం ఆరింటి నుంచి బుకింగ్స్ మొదలవుతాయని వెల్లడించింది. ఈ ట్రైన్‌ల టికెట్ చార్జీలు రాజధాని ట్రైన్ టికెట్‌కు సమానంగా ఉంటాయి. రాజధానిలాగే.. అన్ని ఏసీ బోగీలే ఉండనున్నాయి. ఈ 15 ట్రైన్‌లూ.. న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావిలకు బయల్దేరనున్నాయి. ఈ ట్రైన్‌లో ప్రయాణించేందుకు టికెట్ కన్ఫమ్ అయినవారిని మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ట్రైన్ ప్రయాణానికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం పలు సూచనలు జారీ చేసింది.

టికెట్ కన్ఫమ్ అయినవారినే స్టేషన్‌లోకి అనుమతిస్తారు.ప్రయాణికులు స్టేషన్‌కు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలి.ప్రయాణికులందరూ తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు. ప్రయాణంలోనూ అందరూ తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. గమ్యస్థానం చేరాక.. ఆ రాష్ట్రం అమలు చేస్తున్న ఆదేశాలను సదరు ప్రయాణికులు అనుసరించాలి. కరోనా ముప్పును తప్పుకునేందుకు ప్రయాణికులే.. ఆహారాన్ని, బ్లాంకెట్‌లు, బెడ్ షీట్‌లను వెంట తెచ్చుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్, బిస్కెట్లు ట్రైన్‌లో లభిస్తాయి. వాటిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రయాణికులందరికీ స్టేషన్‌లలో, బోగీల్లోనూ హ్యాండ్ శానిటైజర్లు అందజేస్తారు.

Advertisement

Next Story

Most Viewed