చెత్తను తొలగించే చైనా స్పైడర్‌మ్యాన్

by vinod kumar |
చెత్తను తొలగించే చైనా స్పైడర్‌మ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: చెత్త ఏమో భూమ్మీద ఉంటుంది, స్పైడర్‌మ్యాన్ ఎక్కువగా గాల్లో ఉంటాడు.. మరి చెత్తను తొలగించే స్పైడర్‌మ్యాన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. గాల్లో వేలాడుతూ చెత్తను తొలగిస్తాడు కాబట్టే చెత్తను తొలగించే స్పైడర్‌మ్యాన్ అంటున్నారు. చెత్త గాల్లో ఎందుకు ఉంటుంది, ఎంత ఎత్తు నుంచి విసిరేసినా భూమ్మీద పడుతుంది కదా అని మళ్లీ డౌట్ రావొచ్చు. కానీ భూమ్మీద పడకుండా సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో వేలాడే చెత్త కూడా ఉంటుంది. అవును.. పర్వతాలను ట్రెక్కింగ్ చేసి, అక్కడ పడేసిన బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు అన్నీ గాల్లో వేలాడుతున్న చెత్తతోనే సమానం. ఇలాంటి చెత్తను ఒకే ఒక్క తాడుకు వేలాడుతూ తొలగిస్తాడు కాబట్టే చైనాకు చెందిన 48 ఏళ్ల యాంగ్ ఫేయూని స్పైడర్‌మ్యాన్ అని పిలుస్తుంటారు.

చైనాలోని తియాన్‌మెన్ పర్వతం మీద సందర్శనకు వచ్చిన టూరిస్టులు, ట్రెక్కింగ్‌కు వచ్చిన అధిరోహకులు వేసిన చెత్తను యాంగ్ తొలగిస్తుంటాడు. అయితే పర్వతం మీద కాకుండా ఈ చెత్తను పర్వతం మీది నుంచి కిందకు పడేయడంతో అది మధ్యలో ఎక్కడో అడ్డుగా ఉన్న చెట్ల మీద పేరుకుపోతుంది. ప్లాస్టిక్ డీగ్రేడబుల్ కాదు కాబట్టి ఆ చెట్టు మీదే ఉంటే, అక్కడి జీవావరణానికి నష్టం కలుగుతుంది. అందుకే దాన్ని తొలగించడానికి తియాన్‌మెన్ పర్వత సంరక్షణ సంస్థ యాంగ్ బృందాన్ని నియమించుకుంది. యాంగ్ బృందంలో ఒక సభ్యుడు రాయికి కట్టిన తాడును గట్టిగా పట్టుకుంటే, యాంగ్ దానికి వేలాడుతూ చెత్తను సేకరిస్తాడు. అయితే గతంలో సంవత్సరానికి 5 టన్నుల చెత్తను తీసేవాడినని, కానీ ఇప్పుడు కరోనా పాండమిక్ కారణంగా టూరిస్టుల సంఖ్య తగ్గడం, అలాగే చాలా మందిలో పర్యావరణ సంబంధ జ్ఞానం పెరగడం వల్ల 2020లో కేవలం 2 టన్నుల చెత్త మాత్రమే తాను తీసినట్లు యాంగ్ తెలిపాడు. ఏదేమైనా చెత్తను తొలగించడానికి ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నాడన్న సంగతిని గుర్తుంచుకుని అయినా అనవసరంగా చెత్తను వేయడం తగ్గించుకుంటే మంచిది.

Advertisement

Next Story

Most Viewed