‘మీ’ విప్లవంతో ఇ గవర్నెన్స్‌లో నెం.1

by Shyam |
‘మీ’ విప్లవంతో ఇ గవర్నెన్స్‌లో నెం.1
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కూడా నిండక ముందే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నది. సంక్షేమ పథకాలే కాదు.. సేవలను ప్రజలకు చేరువ చేయడంలోనూ ఆదర్శంగా ఉన్నది. అందుకే ఇ గవర్నెన్స్‌లో వరుసగా రెండేళ్లు 2018, 2019లో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తూ పురోగమిస్తున్నది. ప్రగతిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నది.

పన్ను రాబడుల్లో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. అందుకు సమాంతరంగా అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టడం.. అమలు చేయడంలోనూ అదే దూకుడును సాగిస్తున్నది. మొదటి నాలుగేళ్లు సగటు పన్ను రాబడి వృద్ధిరేటు 17.7 శాతం ఉన్నదని, ఈ శాతంతో తెలంగాణ… దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర సీఎం కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇదే స్థాయిలో సంక్షేమ పథకాలూ అమలులో ఉన్నాయి. ప్రతియేటా సుమారు రూ. 40వేల కోట్ల విలువైన పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కనీసం 1.5 కోట్ల మంది గ్రామీణులు వీటి ద్వారా లబ్ది పొందుతున్నారు. 45శాతం ప్రజలు.. కనీసం మూడు నుంచి 15 రాష్ట్ర సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్నారు.

ఈ స్థాయిలో పథకాలు అమలవుతున్నాయంటే.. వాటిని ప్రజలకు చేరువ చేయడానికి అందుకు తగినట్టుగానే సపోర్టింగ్ సిస్టమ్ అవసరం. ఇక్కడే ‘మీ సేవ’లు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పథకాలకు కావలసిన అర్హత పత్రాలు పొందడానికి, దస్తావేజుల్లో తప్పొప్పుల దిద్దుబాటులు చేయడంలో మీ సేవా కేంద్రాలు.. ప్రజలకు విశేషంగా ఉపకరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పౌరులకు(జీ2సీ), వ్యాపార కార్యకలాపాల(జీ2బీ)కు కీలకమైన సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండా.. పౌరులు ‘మీ సేవ’లో దరఖాస్తులు చేసుకుని నేరుగా లేదా కొరియర్ రూపంలో దస్తావేజులు పొందుతున్నారు. అన్ని రకాల ప్రభుత్వ ‘ఇ-సేవల’ను మీ సేవా కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 ‘మీ సేవ’ కేంద్రాలు వీటిని ప్రజల ముంగిట్లోకి చేర్చాయి. ఒక్క 2019లోనే మీ సేవా కేంద్రాల ద్వారా సేవలు పొందినవారి సంఖ్య 3.08 కోట్లు దాటడం గమనార్హం. ఇప్పుడు 538 రకాల సేవలను ఈ కేంద్రాలు అందిస్తున్నాయి. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చే ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇప్పుడు 102 శాఖలు మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలతో అనుసంధానంలోకి వచ్చాయి.

జీ2సీ, బీ2సీ, సమాచార సంబంధిత సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో టి యాప్ ఫొలియోను ప్రవేశపెట్టింది. ఈ యాప్ కూడా విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. టి యాప్ ద్వారా గతేడాది చివరికల్లా దాదాపు ఏడు లక్షల లావాదేవీలు జరిగాయి. టి యాప్‌తోపాటు టి వాలెట్ అనే డిజిటల్ వాలెట్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం వల్లే.. ఇ గవర్నెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్(పెద్ద రాష్ట్రాల్లో)గా కొనసాగుతోందని విశ్లేషణలున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నది.

Advertisement

Next Story