సాకారం కానున్న 50 ఏళ్ల నాటి కల.. ఆనందంలో రామగుండం ప్రజలు

by Sridhar Babu |   ( Updated:2021-12-27 07:21:49.0  )
sridar
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రామగుండం ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘ కాలిక కోరిక నెరవేరే శుభ తరుణం ఆసన్నమైంది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ రూ. 500 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ సీఎండీ శ్రీధర్‌ ప్రత్యేక చొరవతో ఈ నెల 10వ తేదీన జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో రూ. 500 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. దీనికి సోమవారం కొత్తగూడెంలో జరిగిన చారిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశం తన అంగీకారం తెలిపింది. దీంతో రామగుండం ఏరియాలో మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ఖరారైంది. వైద్య కళాశాలతో పాటు పూర్తి స్థాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయనున్నామని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు, కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం రెండేళ్ల క్రితం శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు.

కాగా, ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సింగరేణి సంస్థ ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 500 కోట్లు మంజూరు చేయాలని సూచించగా.. సంస్థ సీఎండీ శ్రీధర్‌ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచారు. దీనికి బోర్డు తన ఆమోదం తెలిపింది. సోమవారం (డిసెంబర్‌ 27వ తేదీ) నాడు జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల మరియు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో హైదరాబాద్ వంటి పట్టణాల్లో లభించే అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు కూడా అందజేయనున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులు, రిటైర్‌ అయిన కార్మికులు, వారి కుటుంబీకులకే కాకుండా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రెండేళ్ల లో నిర్మాణం పూర్తి..

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ కోట్లాది రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు, డీఎంఎఫ్‌టీ నిధులతో ఇప్పటికే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి చేయూతనిస్తుండగా.. ఈ సారి ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాలకు, వైద్య విద్యలకు ప్రోత్సాహం అందిస్తూ 500 కోట్ల రూపాయలను మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కు కేటాయించడం తన 133 సంవత్సరాల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ కళాశాలను, వైద్యశాలను రెండేళ్ల‌లో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనితో తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని, అలాగే వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్ల లో సాకారం కానుంది. కాగా, రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి కార్మికులు, ఉద్యోగుల తరఫున సీఎండీ శ్రీధర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed