మీడియాకు పాస్ అవసరం లేదు : DGP Mahender Reddy

by Shyam |   ( Updated:2021-05-27 07:30:42.0  )
మీడియాకు పాస్ అవసరం లేదు : DGP Mahender Reddy
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : లాక్‌డౌన్ కాలంలో మీడియా ప్రతినిధులకు పాస్ అవసరంలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(DGP Mahender Reddy) అన్నారు. పోలీసుల మాదిరిగానే మీడియా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే క్రమంలో పోలీసులతో కలిసి పనిచేస్తున్నారని డీజీపీ అన్నారు. అయితే మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డు లేదా సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలన్నారు. గురువారం సైబరాబాద్ కమీషనర్‌రేట్ పరిధిలోని పలు పోలీస్ చెక్ పోస్టులను సీపీ సజ్జనార్ తో కలిసి డీజీపీ సందర్శించారు. మేడ్చల్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను,చెక్ పోస్టులను డీజీపీ పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో చాలా వరకు లాక్ డౌన్ విజయవంతంగా అమలు అవుతుందని, అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో కూడా అమలుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినంత కాలం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. కొవిడ్‌తో పాటు అత్యవసర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళేవారికి పాస్ అవసరం లేదన్నారు. మీడియా కు కూడా పాస్ అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ప్రజలు లాక్‌డౌన్ సహకరించాలని, ఇళ్ల వద్దనే కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed