మోహన్ భగవత్ వ్యాఖ్యలకు దిగ్విజయ్ కౌంటర్

by Shamantha N |   ( Updated:2021-07-05 11:55:56.0  )
మోహన్ భగవత్ వ్యాఖ్యలకు దిగ్విజయ్ కౌంటర్
X

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరిదీ ఒకే డీఎన్ఏ అని, ముస్లింలు దేశంలో ఉండొద్దనేవారు హిందువులేకాదంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ‘హిందూ ముస్లింల ఐక్యతపై మీకున్న భావనను, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా సహా బీజేపీ సీఎంలు, విశ్వహిందూ పరిషత్తు, భజరంగ్ దళ్ కార్యకర్తలకూ బోధిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. వాళ్లను ఒప్పించడం అంత సులభం కాదన్నారు. ‘మీరు హిందూ ముస్లింల మధ్య తీవ్ర ద్వేషాన్ని రగలించారు. సరస్వతి శిశు మందిర్ నుంచి సంఘ మేథో శిక్షణ శిబిరాల వరకు సంఘ్ నేతలు ముస్లింలపై ద్వేషపు బీజాలను నాటారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదు’ అని పేర్కొన్నారు.

‘మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటే, ముందు అమాయక ముస్లింలను వేధించిన బీజేపీ నాయకులందరినీ వాళ్ల పదవుల నుంచి వెంటనే తొలగించేలా నిర్దేశించండి. ఇది ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలుపెట్టిండి’ అంటూ మోహన్ భగవత్‌కు సవాల్ విసిరారు.

ఆవుకు దున్నపోతుకు తేడా తెలియదు: అసదుద్దీన్

మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సైతం ఘాటుగా స్పందించారు. ‘ఈ నేరస్థులకు ఆవుకు దున్నపోతుకు తేడానే తెలియదు. కానీ, జునైద్, పెహ్లూ, రక్బర్, అలీముద్దీన్ వంటి పేర్లు చంపడానికి సరిపోతాయి. ఈ ద్వేషానికి మూలం హిందుత్వం. ఈ నేరస్థులే హిందుత్వ ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భగవత్ మాటలను ఎవరూ నమ్మరు: మాయావతి

ఆరెస్సెస్, బీజేపీ నేతలు చెప్పే మాటలకు, చేసే పనులకు పోలికే ఉండదని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. రాజకీయాలు దేశ ప్రజలను విభజిస్తాయని మోహన్ భగవత్ అన్నారని, కానీ అది సరైన ప్రకటన కాదని ఆక్షేపించారు. కులతత్వం, మతత్వం, ద్వేషం సాధారణ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, దీనంతటికీ కారణం ఆరెస్సెస్ గుడ్డిగా బీజేపీకి మద్దతు పలకడం వల్లేనని అన్నారు. అందువల్ల ఉన్నట్టుండీ ముస్లింలపై సానుకూలంగా మాట్లాడిన మోహన్ భగవత్‌ను ఎవరూ నమ్మరని వెల్లడించారు.

Advertisement

Next Story