ఆరోగ్యశాఖలో మాస్క్‌ల లొల్లి..?

by  |
ఆరోగ్యశాఖలో మాస్క్‌ల లొల్లి..?
X

దిశ, వరంగల్: వైద్యారోగ్యశాఖలో మాస్క్‌ల పంచాయతీ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 70 ఏళ్లపై బడిన రోగులకు ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాకు టార్గెట్ నిర్ధేశించి మాస్క్‌లు తయారు చేయించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి కొవిడ్-19 నిధుల కింద ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేసింది. కానీ, అధికారుల మధ్య సమన్వయ లోపంతో మాస్క్‌ల తయారీ వ్యవహారం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోన్నది. అంతేగాకుండా కమీషన్లకు అలవాటుపడిన కొందరు అధికారుల తీరు గందరగోళానికి దారితీసినట్లు ప్రచారం జరుగుతోన్నది.

ఆలస్యంలో ఆంతర్యమేంటి..?

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటోన్నది. ఈ నెల 14న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి ఆరోగ్యశాఖ అధికారులకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 70 ఏళ్లకు పైబడిన టీబీ, హెచ్ఐవీ, బీపీ, డయాబెటీస్, హెపటైటిస్ బీ తదితర వ్యాధి‌గ్రస్తులకు ఒకరికి రెండు చొప్పున ఉచితంగా మాస్క్‌ల పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ మాస్క్‌లను ఆయా జిల్లాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలు, చేనేత కార్మికులతో తయారు చేయించాలన్న నిబంధన పెట్టింది. నిర్ధేశిత కొలత ప్రకారం కాటన్ వస్త్రాలతో ఒక మాస్క్ తయారీకి రూ.12 ల చొప్పున చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సుమారు 10 లక్షలు టార్గెట్ విధించగా వరంగల్ అర్భన్ జిల్లాకు 3,19,356, వరంగల్ రూరల్‌కు 1, 62,710, మహబూబాబాద్ కు 2,47,090, ములుగు జిల్లాకు 57,626, భూపాలపల్లి కి 76,922, జనగామ జిల్లాకు 1,24,710 మాస్క్‌లు టార్గెట్ గా నిర్ణయించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మహిళలకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో నిబంధన విధించారు.

మహిళ సంఘాల ఆందోళన..

ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్‌ల తయారీ విషయంలో ఆరోగ్యశాఖ, డీఆర్డీఏ అధికారుల తీరు ఆందోళనకు దారితీస్తున్నట్లు తెలుస్తోన్నది. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి వారే సరిపడా క్లాత్‌ను కొనుగోలు చేసి మహిళా సంఘాలకు ఇస్తున్నట్లు సమాచారం. ఒక మాస్క్ కుట్టినందుకు వారికి 3 రూపాయాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోన్నది. దీని ప్రకారం అధికారులు బట్ట, కూలీకి 7 రూపాయాల వరకు ఖర్చు చేసి మిగతా 5 రూపాయాలు కమీషన్ కింద నొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మాస్క్‌ల తయారీ వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story