మారుతీ సుజుకి త్రైమాసిక ఫలితాల్లో బేజారు

by  |
మారుతీ సుజుకి త్రైమాసిక ఫలితాల్లో బేజారు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో భారీగా నష్టాలను మూటగట్టుకుంది. కరోనాకు ముందు వరకు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొన్న సంస్థ తర్వాత కరోనా వ్యాప్తితో పాటు లాక్‌డౌన్ దెబ్బకు తొలి త్రైమాసికంలో మారుతీ సుజుకి నికర నష్టం రూ. 249.4 కోట్లుగా వెల్లడించింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,435.5 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 79 శాతం క్షీణించి రూ. 4,106.50 కోట్లుగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 19,719.80 కోట్లుగా ఉండేది. కంపెనీ ఖర్చులు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 18,645.3 కోట్లతో పోలిస్తే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 5,770.50 కోట్లకు తగ్గినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

కొవిడ్-19 కారణంగా కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లాక్‌డౌన్ దెబ్బకు సున్నా ఉత్పత్తి, సున్నా అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. మే నెలలో ఉత్పత్తి, అమ్మకాలు కొంతమేర ప్రారంభమైనప్పటికీ సంస్థ ప్రాధాన్యత.. వినియోగదారులతో సహా సరఫరా గొలుసు, ఉద్యోగుల భద్రతా, ఆరోగ్యం లాంటి అంశాలపై దృష్టి సారించినట్టు కంపెనీ తెలిపింది. మొత్తం త్రైమాసికంలో ఉత్పత్తి కేవలం రెండు వారాల సాధారణ పనికి సమానమైనదిగా భావించాలని, ఈ పరిణామాలు త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపిందని కంపెనీ ప్రకటించింది. కాగా, తొలి త్రైమాసికంలో మారుతీ సుజుకి మొత్తం 76,599 యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 67,027 యూనిట్లు ఉండగా, ఎగుమతులు 9,572 యూనిట్లుగా ఉన్నాయి.

Advertisement

Next Story