పెండ్లట..మీకు అర్థమవుతోందా?

by  |
పెండ్లట..మీకు అర్థమవుతోందా?
X

లాక్‌డౌన్ ఉంటేనే కరోనా వైరస్ తీవ్రంగా ఉందని, సడలింపులిస్తే తగ్గిపోయిందని అర్థం కాదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని కాలర్ ట్యూన్ మొత్తుకుంటున్నా ఎవరూ వినిపించుకోట్లేదు. వెళ్తే వెళ్లారు కనీసం మాస్కులు పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అంటే కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా మామూలు రోజుల్లో పెళ్లిళ్లు జరుపుకుంటున్నట్లుగా అతిథులను పిలిచి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న హీరో రానా పెళ్లి చేసుకున్నారు. పిలవడానికి ఆయనకు చుట్టాలు లేరా? కానీ, దగ్గరి వాళ్లని మాత్రమే పిలిచి చేసుకున్నాడు. ఎందుకు? నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు ఇలాంటి రోజుల్లో పెళ్లిళ్లకు పిలవరు. పెళ్లికి పిలిచారు అంటే ఆ బంధువుల మీద ప్రేమ లేనట్లే!

అవును..నిజమే..పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ వేడుకను అందరిముందు చేసుకోవాలి. గొప్పగా జరుపుకోవాలి. కానీ, అది ఒకప్పుడు. పెళ్లికి వచ్చిన వారిలో ఏ ఒక్కరికి కొవిడ్ వైరస్ ఉన్నా కూడా మీ ఒక్కరి జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక, కొందరి జీవితాల్లో చివరి వేడుక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ ఇంటి దగ్గర ఉన్నాం.. ఖాళీగా ఉండి ఏం చేస్తాం… పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోద్ది అని చదువుకున్నవాళ్లు కూడా కొందరు ఆలోచన చేస్తున్నారు. మరీ గ్రామాల్లో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఫంక్షన్ హాళ్లలో అనుమతి ఇవ్వడం లేదని ఇంటి ముందు పెళ్లి చేస్తున్నారు. యాభై మంది మాత్రమే వస్తారని తహసీల్దార్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని 500 మందికి వంటలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాళ్లను రాజకీయ పలుకుబడితో నోర్లు నొక్కేస్తున్నారు.

సరే..ఎలాగోలా పెళ్లిళ్లు చేస్తున్నారు. కనీసం జాగ్రత్తలు అయినా పాటించాలి కదా..మాస్కులు వేసుకుంటే ఫొటోలు, వీడియోల్లో సరిగా కనిపించడం లేదు అని తీసేస్తున్నారు. చుట్టాలతో పలకరింపులు, ముచ్చట్లు, ఆలింగనాలు, కౌగిలింతలు..ఇగ..ఇంకెక్కడి ఫిజికల్ డిస్టెన్స్. ఇవన్నీ చేయొద్దని ఎవరూ చెప్పడం లేదు. కానీ, ఇది సరైన సమయం కాదు అంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే నాలుగు లీటర్ల శానిటైజర్ తీసుకొచ్చాం అని గొప్పగా చెప్తున్నారు. కానీ, అందులో నాలుగు చుక్కలు వాడే దిక్కు కూడా లేదు. ఇవి కాదన్నట్లు గత వారం రోజులుగా ముహుర్తాలు అయిపోతున్నాయనే తొందరలో..బయటి నుంచి ఫంక్షన్ హాల్‌కు గేట్ వేసి, వాహనాలను దూరంగా పార్కు చేసి, స్పీకర్ల సౌండ్ కొద్దిగా పెట్టి తతంగం కానిచ్చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు… సాధారణ రోజుల్లో పెట్టినట్లు సాయంత్రం ఊరేగింపులు, డీజేలు. ఒక్క గంటసేపే అంటూ పర్మిషన్ తీసుకుని డీజేలు పెడుతున్నారు. కరోనా వైరస్ పాకడానికి ఒక్క మిల్లీ సెకను చాలనే విషయం మీకు అర్థమవుతుందా?

పెళ్లిళ్లు చేసుకోవద్దు అని ఎవరూ చెప్పడం లేదు. చేసుకోండి.. కానీ, సర్కారు సూచించిన నిబంధనల మేరకు చేసుకోండి. అమ్మాయి తరఫున 20 మంది, అబ్బాయి తరఫున 20 మంది, మరో పది మంది స్నేహితులను పిలుచుకుని కానిచ్చేయండి. మీకు పెళ్లి అయింది అని మీ దగ్గరి వాళ్లకి తెలిస్తే చాలు. భూమ్మీద జరుగుతున్న వాటిలో మీదే మొదటి పెళ్లి కాదు. కాబట్టి ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు..మీ పెళ్లికి వచ్చిన వారిలో ఏ ఒక్కరికైనా కరోనా పాజిటివ్ వచ్చి, ఆరోగ్యం విషమించినపుడు, వారు ఆస్పత్రిలో ఉండి, మీకు కాల్ చేసి ‘నీ పెళ్లికి రాకుంటే నాకు ఈ దుస్థితి రాకపోవు’ అని ఒక్కమాట అన్నారనుకోండి. ఆ పశ్చాత్తాపం జీవితాంతం మీతో పాటే ఉంటుంది. అదే మీరు వాళ్లని పెళ్లికి పిలవకుండా పెళ్లయ్యాక కాల్ చేసి, ఒకరోజు ఇంటికి భోజనానికి పిలిచి క్షమాపణలు చెప్పి, ఆశీర్వాదం తీసుకుంటే ఇటు మీరు ఆనందంగా ఉంటారు, అటు వాళ్లూ ఆనందంగా ఉంటారు. అందుకే అంటున్నాం..మీకు అర్థమవుతోందా? కాస్త ఓపికపట్టండి. శ్రావణ మాసం మళ్లీ వస్తుంది..కానీ, శ్వాస పోతే తిరిగిరాదు.



Next Story

Most Viewed