GST పేరుతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టారు

by Sridhar Babu |
maoists
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జీఎస్టీ పేరిట రాష్ట్రాల ఆదాయాలను కేంద్రం గండికొట్టిందని, కొవిడ్ వ్యాక్సిన్ భారాన్ని కూడా రాష్ట్రాలపైనే మోపటం దారుణమని మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అన్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశంలో రోజుకు 3 లక్షల చొప్పున పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని, మరోవైపు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా.. రికవరీ రేటు తగ్గుతున్న చోద్యం చూస్తుండటం సిగ్గు చేటన్నారు. కర్ఫ్యూ పేరిట ప్రజలపై లాఠీలు ఝులిపించటం, మాస్కులు ధరించలేదంటూ జరిమానా విధించడం పాలకుల ఫాసిస్టు విధి విధానాలకు నిదర్శనమన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌కు తెర లేపిన ప్రభుత్వం ప్రజల్ని ఆర్థికంగా, మానసికంగా వేధిస్తోందని ఆరోపించారు. లాభాపేక్షతో పర్యావరణ విధ్వంసం సృష్టించిన సామ్రాజ్యవాదులు, కరోనా మహమ్మారి విజృంభనకు పరోక్షంగా కారకులయ్యారని తెలిపారు. కరోనా సోకిన ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులకు అప్పగించి బ్లాక్ దందాను పెంచి ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు.

ఆహార, ఆరోగ్య భద్రతతో పాటు జీవన హక్కుల కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దినసరి కూలీ, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వాలు 20 కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి అవసరాల కోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న సన్నకారు రైతుల రుణాలు రద్దు చేయాలని, వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు పెంచి జీడీపీలో 20 శాతం కేటాయించాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీలేని రుణాలు అందజేసి, రెండేళ్ల వరకు జీఎస్టీ రద్దు చేయాలన్నారు. ఏడాది వరకు మారిటోరియం పొడగించాలని, బ్యాంకుల ద్వారా కాకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలు అందజేయాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు గ్రామ పంచాయతీలకు సరఫరా చేయాలని, సంచార వైద్యశాలలతో గ్రామాల్లో కొవిడ్ రోగులకు వైద్య చికిత్సలు అందించాలని కోరారు. కేంద్రం ఆయుధ కొనుగోళ్లకు కేటాయించిన నిధులను వైద్య రంగానికి మళ్ళించాలని, నిరుద్యోగ యువతకు నెలకు ఐదు వేల జీవనభృతి చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ నిలిపివేయాలన్నారు. విద్యారంగానికి జీడీపీలో 5శాతం వైద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed