బెంగళూరులో నయా వంటలక్క

by  |
బెంగళూరులో నయా వంటలక్క
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెరపై ‘వంటలక్క’ ఎంత ఫేమసో..వేరే చెప్పనక్కర్లేదు. కాకపోతే.. ఆమె సీరియల్ పరంగా అంతగా అభిమానాన్ని సంపాదించుకుంది. కానీ, బెంగళూరుకు చెందిన ‘సరోజ్ దీదీ’ అక్కడి జనాలకు నిజంగానే వంటలక్కగా మారిపోయింది. అందరూ అంతా అయిపోయిందనుకునే వయసులో ఆమె ఇప్పుడే మొదలుపెట్టింది. నేడు ఎన్నో కోటానుకోట్లు సంపాదిస్తున్న వ్యాపారాలు అన్నీ కూడా ఓ చిన్న ఐడియాతో, ఓ ఇరుకు గదిలోనే ప్రారంభమయ్యాయి. అలాంటి ఓ ఐడియానే.. సరోజ్ దీదీకి మరో మార్గాన్ని చూపించింది. ఓ కొత్త బిజినెస్ ప్రారంభించేలా చేసింది. కొవిడ్ -19 టైమ్‌లో తన చేతి మాధుర్యాన్నీ బెంగళూరు ప్రజలకు రుచి చూపిస్తూ.. తన జీవితాన్ని మార్చుకునేందుకు ఓ ముందడుగు వేసింది.

సరోజ్ దీదీ..ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఆమె అందరిలానే ఓ సాధారణ గృహిణి. తన భర్తతో పాటు బెంగళూరులోని మంగమ్మనాపాల్య ప్రాంతంలో ఓ చిన్న హోటల్ రన్ చేస్తుండేవాళ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు. అనుకోకుండా ఆమె భర్త చనిపోయాడు. ఆ హోటల్ మూసివేసింది. తన పిల్లల కోసం అందరి ఇండ్లలో ఇంటిపని, వంట పని చేస్తూ కాలం గడిపేది. ఆమె అంకిత్ వెంగళూర్కర్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో కూడా పని చేస్తుండేది. సరోజ్ వంటలకు అంకితే కాదు.. ఇంటిల్లిపాది పెద్ద ఫ్యాన్స్. ఆమె ఏం చేసినా మెచ్చుకోకుండా ఉండలేరు. ఆమెతో సరాదాగా ఉండేవారు. ‘నువ్వు హోటల్ పెడితే.. బెంగళూరు ప్రజలు క్యూలో నిలబడతారు’ అని ఎప్పుడూ సరోజ్‌తో అంకిత్ అనేవాడు. కానీ, ఓ రోజు అంకిత్‌కు నిజంగానే.. ఈ మాటలు నిజం ఎందుకు చేయకూడదనుకున్నాడు. వెంటనే.. ఆమెతో మాట్లాడాడు. ఆమె కూడా సంతోషంతో ఒప్పుకుంది.

అంకిత్ ప్రోత్సాహంతో తన ఇంట్లోనే ‘హోమ్ కుక్డ్ బిజినెస్’ ప్రారంభించింది సరోజ్ దీదీ. ఇందుకోసం అంకిత్ తన ట్విట్టర్ ద్వారా బెంగళూరు ప్రజలకు సరోజ్ దీదీ జీవితం గురించి చెప్పాడు. ఆమె వంటల ప్రత్యేకతను వివరించాడు. త్వరలో ఇలా ‘ఇంటి భోజనం’ అందించబోతున్నామని ప్రకటించాడు. ‘మీరు బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ దగ్గర్లో ఉంటే.. టిఫిన్ లేదా యమ్మీ ఫుడ్ కావాలనుకుంటే.. సరోజ్ దీదీని కన్సిడర్ చేయండి. ఆమెకు ఎక్‌స్ట్రా ఇన్‌కమ్ వస్తుంది. మీకు సూపర్ డెలిషియస్ ఫుడ్ ఇంటి వద్దకు వస్తుంది’ అని పోస్ట్ చేశాడు అంకిత్. సరోజ్ దీదీ.. మొదటి రోజును పీతల కర్రీతో మొదలుపెట్టింది. అంకిత్, సరోజ్‌ అనుకున్నట్లుగానే.. తొలిరోజు బెంగళూరు ఫుడ్డీలు.. సరోజ్ దీదీకి ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ డే 10 ఆర్డర్లు వచ్చాయి. కర్రీకి 300 రూపాయలు.. డెలివరీ చార్జీలు డుంజో సర్వీస్ ఆధారంగా ఉంటుందని తెలిపాడు. అంతేకాదు ఆమె ‘పీతల కర్రీ’ వీడియోను 20 వేల మందికి పైగా చూశారు.

సరోజ్ దీదీ వంటల ఘుమఘుమలు..ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా వరకు చేరాయి. దాంతో ఆయనకు స్పందించాడు. ‘ఇది చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఎంతో గర్వంగా కూడా ఉంది. ఈ పని చేసినందుకు అంకిత్ నీకు ధన్యవాదాలు. సరోజ్ దీదీ.. న్యూయార్క్‌కు కూడా .. మీ వంటల్ని డెలివరీ చేస్తారా’ అంటూ చమత్కరించాడు వికాస్ ఖన్నా. ఆలోచన చిన్నదే కావచ్చు. కానీ, దాని ఇంపాక్ట్ ఊహించలేము. వయసు కూడా ఓ నెంబర్ మాత్రమే. మనమీద మనకు ఆత్మవిశ్వాసం ఉంటే చేయాలనే తపన ఉంటే చాలు..ఏ వయసులోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, జీవితాన్ని కొత్తగా ప్రారంభించొచ్చు.


Next Story

Most Viewed