భార్య కోసం.. వీల్ చెయిర్ బైక్

దిశ, వెబ్‌డెస్క్ :
యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన జాక్ నెల్సన్.. తన భార్య కోసం ఓ వీల్ చెయిర్ వెహికల్‌ను రూపొందించాడు. దీంతో ఇన్నాళ్లూ చక్రాల కుర్చీకే పరిమితమైన తన భార్య.. ఇప్పుడు కొండకోనల్లో, పర్వత ప్రాంతంలో, ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా తనకు తానే వెళ్లగలుగుతోంది. పైగా ఈ ఆవిష్కరణ నెల్సన్ భార్యకు మాత్రమే కాదు.. ఎంతోమంది వీల్ చెయిర్ బాధితులకు ఓ వరంగా మారింది.

నెల్సన్.. ‘జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్’ అనే తన యూట్యూబ్ చానల్ ద్వారా వివిధ టెక్ కంపెనీలు విడుదల చేసిన పరికరాలపై రివ్యూలతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు. వాటి నాణ్యత, ఫర్ఫార్మెన్స్, ఆబ్జెక్ట్ కేపబిలిటీ అన్నీ వివరిస్తాడు. 2012లో తన యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించిన నెల్సన్.. నెటిజన్ల ఆదరణతో ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 775 వీడియోలతో 6.1 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న నెల్సన్.. ఫేమస్ హార్స్ రేసర్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ కాంబ్రీ కేలర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

2005లో కేలర్.. గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. ఇక అప్పటి నుంచి తను చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ అడ్వెంచర్స్‌ను ఇష్టపడే కేలర్.. అలా ఇంటికే పరిమితమైపోవడం నెల్సన్‌కు నచ్చలేదు. అందుకే ఆమె కోసం 2018లో ఆఫ్ రోడ్ వీల్ చెయిర్ ఎలక్ట్రిక్ బైక్ సిద్ధం చేశాడు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్. ఒక్కసారి దీన్ని చార్జ్ చేస్తే.. 15 నుంచి 34 కిలోమీటర్ల వరకు వెళ్లి రావచ్చు. ఈ బైక్‌పై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ అన్యోన్య దంపతులు తమ అడ్వెంచర్ బైక్‌కు ‘రిగ్’ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇది సాదా సీదా బైక్ కాదు.. పర్వతాలు, మంచు, రాళ్లు, ఇసుకలోనైనా దీనిపై సులువుగా వెళ్లొచ్చు. నెల్సన్ ఈ వీల్ చెయిర్ బైక్‌ను తన భార్యకు మాత్రమే అందివ్వలేదు.. వీల్ చెయిర్‌తో బయటకు వెళ్లలేక ఇబ్బంది పడే ఎంతోమందికి తక్కువ ధరకే ఇలాంటి బైక్‌లను తయారుచేసి అందిస్తున్నాడు.

Advertisement