దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
Man arrested
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తుండగా అలుగునూర్ గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్, స్థానికులు చాకచక్యంగా ఒక దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో అలుగునూర్‌లోని రాజరాజేశ్వర సిమెంటు, స్టీల్ దుకాణంలో షట్టర్ లేపి ఇద్దరు దొంగలు దొంగతనం చేసి బయటికి వస్తున్నారు. అదే సమయంలో బయటకొచ్చిన కొమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తి గమనించి ఎవరు మీరు అని అడిగాడు. వారు పారిపోయే ప్రయత్నం చేయగా, అందులో ఒకరిని శ్రీనివాస్ చాకచక్యంగా పట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో సదరు దొంగ చేతిలో ఉన్న ఇనుప రాడ్‌తో శ్రీనివాస్‌పై దాడి చేశాడు. దీంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కేకలు వేశాడు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి శ్రీనివాస్ పట్టుకున్న దొంగను బంధించారు. అనంతరం రాజరాజేశ్వర సిమెంట్ స్టీలు దుకాణం యజమానికి సమాచారం అందించారు.

వెంటనే అక్కడకు వచ్చిన దుకాణం యజమాని షాపులో పదివేల నగదు పోయినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడిన నిందితుడి పేరు బాన్సువాడకు చెందిన మహేందర్ సింగ్ కాగా, పారిపోయిన దొంగ పేరు ప్రతాప్ సింగ్, ఇతనిది నాందేడ్‌గా గుర్తించారు. ఇప్పటికే ఇతనిపై పలు జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్టు తెలిపారు. ఇటీవల కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతని వద్ద రూ.80 వేలు, ఇనుప రాడ్, రెండు కత్తులు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కోర్టుకు తరలించామని ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ దొంగతనం జరుగుతుండగా పసిగట్టి ప్రాణాలకు తెగించి పట్టుకున్న కొమ్ము శ్రీనివాస్, స్థానికులను రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, అభినందించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed