94శాతం క్షీణించిన మహీంద్రా లాభం

by Shyam |
94శాతం క్షీణించిన మహీంద్రా లాభం
X

ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ శుక్రవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం రూ.54.64కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 94శాతం క్షీణించిందని, కరోనా వైరస్ వ్యాప్తి తొలి త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని తెలిపింది.

గత ఏడాది తొలి త్రైమాసికంలో పన్నులు చెల్లించిన తర్వాత రూ.894.11కోట్లు అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. కార్యకలాపాల ద్వారా తొలి త్రైమాసికంలో ఆదాయం 39శాతం క్షీణించి రూ.16,321.34కోట్లుగా ఉందని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.26,041.02 కోట్ల అని తెలిపింది. ఆటోమొబైల్ విభాగం ద్వారా తొలి త్రైమాసికంలో చేకూరిన ఆదాయం రూ.6,508.6 కోట్లుగా ఉంది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.13,546.84కోట్లు కావడం గమనార్హం. పరికరాల విభాగంలో ఆదాయం రూ.4906.92కోట్లు కాగా, గత ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.6077.9 కోట్లు ఉంది. ఆర్థిక సేవల ద్వారా ఆదాయం రూ.3,031.69 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,822.03కోట్లుగా ఉంది. హాస్పిటాలిటీ విభాగంలో రూ.296.26కోట్ల ఆదాయం రాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.612.49కోట్లుగా ఉంది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగిందని, ఆ ప్రభావం మొదటి త్రైమాసిక ఫలితాలపై చూపిందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. తొలి త్రైమాసికంలో చాలా కాలం లాక్‌డౌన్ కారణంగా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని, ఆ తర్వాత కూడా ఆంక్షల ద్వారా కొనసాగించడంతో ఆదాయం, లాభాలపై ప్రభావం చూపిందని పేర్కొంది.

తొలి త్రైమాసికంలో పన్ను చెల్లించిన తర్వాత స్వతంత్ర లాభం రూ.112.1కోట్లు గాకా, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,313.82కోట్లుగా ఉన్నది. కార్యకలాపాల ద్వారా స్వతంత్ర ఆదాయం రూ.5,602.18 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.12,922.72కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది.

Advertisement

Next Story