కంగనా, మహేశ్‌భట్ వార్..

by Jakkula Samataha |
కంగనా, మహేశ్‌భట్ వార్..
X

యంగ్‌స్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. హిందీ చిత్ర సీమలో జరుగుతున్న రాజకీయాలను బయటకు తీస్తోంది. బంధుప్రీతి వల్ల నటులు పడిన, పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తరతరాలుగా ఇండస్ట్రీలో నాటుకుపోయిన వారసత్వం.. కొత్తగా వచ్చే నటులను ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలుస్తోంది. నెపోటిజం ప్రోత్సహిస్తున్న వారికి ఎస్ చెప్తేనే ఆఫర్.. నో చెప్తే అసలు ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా చేస్తుందని సీనియర్ నటులు కూడా మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. ఈ క్రమంలో తన విషయంలోనూ ఇలాంటిదే జరిగిందని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్‌పై మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసింది కంగనా రనౌత్. తను చెప్పినదానికి తలాడిస్తే ఓకే కానీ, నో చెప్తే చెప్పుతో కొడతాడని.. ఆ బాధలను తానే స్వయంగా అనుభవించానని కంగనా ఆరోపించగా.. పేరు కోసం తాపత్రయపడుతూ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు మహేశ్ భట్.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గ్యాంగ్‌స్టర్ సినిమా ద్వారా తనకు ఒక ప్లాట్‌ఫామ్ అందించారు. అయితే ఈ విషయంలో మహేశ్ భట్‌ను గౌరవిస్తానన్న కంగనా.. చాన్స్ ఇచ్చారు కదా! అని తనపై పిచ్చిది, సైకో అని ముద్ర వేస్తూ తన మీదకు చెప్పులు విసిరే హక్కు ఎవరిచ్చారని? ప్రశ్నించింది.

చాన్స్ ఇస్తే చెప్పుతో కొట్టాలా?

గ్యాంగ్‌స్టర్, ఓ లంహే సినిమాలు చేస్తున్న సమయంలో తనను స్టూడియోకు పిలిచిన మహేశ్ భట్.. డోక సినిమా చేయాలని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. కానీ ఒక సూసైడ్ బాంబర్ హీరోయిజాన్ని ప్రదర్శించే కథకు తను నో చెప్పానంది. దీంతో మహేశ్ భట్ కోపంతో ఊగిపోయాడని.. కొట్టేందుకు తన మీదకు వచ్చేశాడని తెలిపింది. కానీ మహేశ్ కూతురు పూజ భట్ అడ్డుకోవడం వల్ల.. ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డట్టు చెప్పుకొచ్చింది.

ఇక ‘ఓ లంహే’ చిత్రం ట్రయల్ సమయంలో మహేశ్ భట్ తనపైకి చెప్పు విసిరాడని ఆరోపించింది కంగనా. ఆ సినిమా స్క్రీనింగ్‌కు కూడా తనను హాజరుకాకుండా థియేటర్ గేట్ వద్దే ఆపేశాడని, చాలా తిట్టాడని వెల్లడించింది. తిట్టినా సరే పరవాలేదనుకుని సినిమా చూసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా చెప్పులు విసిరాడని చెప్పింది కంగనా. అక్కడున్న వారు ఇదంతా చూసి తనను ఆపారని తెలిపింది. బాలీవుడ్‌లో మాఫియా హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటకు రాలేక పోతున్నారన్న కంగనా.. వారు చెప్పినదానికి తలాడించకపోతే చంపేస్తారని ఆరోపించింది.

కంగనాకు కౌంటర్..

కంగనా ఇన్ని ఆరోపణలు చేశాక వాటన్నింటికీ సమాధానం చెప్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు మహేశ్ భట్. ‘నిజమైన పదాలు అనర్గళంగా లేవు. అనర్గళమైన మాటలు నిజం కాదన్నారు మహేశ్ భట్. వివేకవంతులు తమ అభిప్రాయాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవాల్సిన వారు తెలివైన వారు కాదు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రపంచం తనను పవిత్రమైన వ్యక్తిగా గుర్తు పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని.. విమానాశ్రయాలు, స్టాంపులపై తన పేరు ఉండాలని అనుకోవడం లేదన్నారు మహేశ్ భట్. శాశ్వతత్వం కోసం మనిషి పడే తపన విషాదకరం అంటూ ఇన్ డైరెక్ట్‌గా కంగనాకు పంచ్ ఇచ్చాడు. పేరు కోసం తాపత్రయ పడుతూ అనవసర ఆరోపణలు చేస్తోందని పరోక్షంగా వివరించాడు మహేశ్ భట్.

Advertisement

Next Story