పేలనున్న గ్యాస్‌బండ రేటు!

by Harish |
పేలనున్న గ్యాస్‌బండ రేటు!
X

ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు బుధవారం నుంచి సబ్సిడీలో లేని వంట గ్యాస్ ధరలను పెంచనున్నాయి. ఒక్కో సిలిండర్‌కు సుమారు రూ. 147 వరకు ఈ పెంపు ఉండనుంది. గడిచిన కొన్ని నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. కాగా చివరిసారి జనవరి 1న సిలిండర్‌పై రూ. 19లు పెంచిన గ్యాస్ కంపెనీలు.. రానున్న ఆగస్టు నుంచి ప్రతి నెలా ఎల్‌పీజీ ధరలను పెంచనున్నాయి. తద్వారా సామాన్యుల జేబుకు చిల్లు తప్పనిసరి కానుంది.
ఇండియా మొత్తంలో రోజుకు 30 లక్షలకు పైగా సిలిండర్లను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ సంస్థ ధరల ప్రకారం.. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర జనవరి 1న రూ. 714 గా ఉండేది. ప్రస్తుతం పెరగనున్న ధరలతో అది రూ. 858కు చేరుకోనుండగా, కోల్‌కతాలో కొత్త ధర రూ. 896గా ఉండనుంది. ముంబైలో సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 684.50 నుంచి రూ. 829.5 లకు పెరగనుంది. చెన్నైలో గతంలో రూ. 734 గా ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 881గా మారనుంది.

ప్రధాన నాలుగు మెట్రో నగరాల్లో సవరించిన ఎల్‌పీజీ ధరలు :

ఢిల్లీ : రూ. 858.5 ( రూ. 144 పెంపు)
కోల్‌కతా : రూ. 896 (రూ. 149 పెంపు )
ముంబై : రూ. 829.5 ( రూ. 145.5 పెంపు )
చెన్నై : రూ. 881 ( రూ. 147 పెంపు )

దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ రేట్లపై ఏడాదికి 12 సిలిండర్లను అందిస్తుంది. అంతర్జాతీయ ఎల్‌పీజీ రేటు, విదేశీ మారకపు రేటులో హెచ్చుతగ్గులను బట్టి ఎల్‌పీజీపై పన్ను రేట్లు ప్రతి నెలా మారుతుంటాయి. అంతర్జాతీయ రేట్ల పెరుగుదలతో పాటు, ఎల్‌పీజీపై జీఎస్టీ ఉంటుంది. బేస్ ధరను బట్టి కాకుండా మార్కెట్ ధరను బట్టి కూడా మార్పులుంటాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా సబ్సీడీ పొందిన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అధిక రాయితీని కూడా అందిస్తోంది. కాగా సబ్సిడీ పరిధిలో లేని వర్గాలకు అటువంటి రాయితీ లభించదు. సబ్సిడీ పరిధిలోని సిలిండర్లను కొనుగోలు చేసేవారు మార్కెట్ ధరతో పాటు దానిపై జీఎస్టీని కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story