రాత్రి ఎత్తారు… ఉదయం దించారు

by Sridhar Babu |
రాత్రి ఎత్తారు… ఉదయం దించారు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం వద్ద విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు గేట్లను శనివారం రాత్రి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఆదివారం ఉదయానికి కల్లా గేట్లను మూసివేశారు. హాడావుడిగా అధికారులు గేట్లు ఎందుకు ఎత్తారో ? మరునాడే ఎందుకు మూసేశారో వారికే తెలియాలి. శనివారం సాయత్రం 6 గంటలకు ఎల్ఎండీకి చెందిన మూడు గేట్లు ఆర్భాటంగా ఎత్తిన అధికారులు, రాత్రికే రెండు గేట్లను మూసి వేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అన్ని గేట్లను మూసినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

ఇన్ ఫ్లో అంతకలేకున్నా అధికారులు గేట్లు ఎందుకు ఎత్తారో అంతుచిక్కడం లేదు. 24.035 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్ఎండీకి దాదాపు 22.960 టీఎంసీల నీరు వచ్చింది. మరో టీఎంసీ కన్నా ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉంటేనే గేట్లను ఎత్తాల్సి ఉన్నప్పటికీ వరదను అంచనా వేయకుండా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం వెనక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. శనివారం ఉదయం నాటికి వరద ప్రవాహం 300 క్యసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశామని అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed