కలిసి ఉండలేక.. విడిచి బతకలేక.. ప్రేమికుల సూసైడ్!

దిశ ప్రతినిధి, నల్లగొండ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలుగన్నారు. అదే ఆశతో చాలా కాలంగా కలిసి మెలిసి తిరిగారు. ఈ క్రమంలోనే 6 నెలల కిందట అబ్బాయికి వేరే యువతితో వివాహం జరిగింది. అయినా, వారి మధ్యనున్న ప్రేమ తగ్గలేదు. ఎవరి కంట పడకుండా తరచూ కలుసుకునే వారు. ఎలాగు అబ్బాయికి పెళ్లి కావడంతో ‘కలిసి ఉండలేక.. విడిపోయి బతకలేమనే’ నిర్ణయానికి వచ్చారు.ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం శివారులో బుధవారం వెలుగులోకి వచ్చింది. తెల్లవారు జామున అటుగా వెళ్లిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మృతులు కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన రాచకొండ శ్రీను (26),  చిత్తలూరి నాగేశ్వరి(17)గా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన శ్రీను, నాగేశ్వరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో 6నెలల కిందట శ్రీనుకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తరువాత కూడా ఇద్దరూ తరుచూ కలుసుకునే వారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. తమ గ్రామం పక్కనే ఉన్న బొప్పారం శివారులోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఇద్దరు కలిసి చాలా సేపు గడిపారు. తర్వాత కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. అపస్మారక స్థితిలో ఉన్నావారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement