- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుల తరబడి ‘క్యూ’లో లారీలు.. సమన్వయ లోపమే కారణమా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: వందల లారీలు ఇసుక లోడింగ్ కోసం క్యూ కట్టాయి. రోజుల కొద్ది లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి తయారైంది. పర్యవేక్షించాల్సిన టీఎస్ఎండీసీ అధికారులకు, క్వారీలకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు గోదావరి తీరంలోని ఇసుక పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పలు క్వారీలు ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ సేకరిస్తున్న ఇసుకకు తగ్గట్టుగా లారీలకు అనుమతి ఇవ్వడం లేదన్న విషయం స్పష్టం అవుతోంది. ఆయా క్వారీల నుంచి వచ్చిన వందలాది లారీలు క్వారీల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. మంగళవారం బొమ్మాపూర్ క్వారీలో జరిగిన గొడవతో ఈ విషయం తేటతెల్లం అయింది. ఆన్ లైన్‌లో డీడీలు జారీ చేస్తున్న టీఎస్ఎండీసీ రీచ్ ల్లో పరిస్థితిని అంచనా వేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. డీడీలు తీసుకుని క్వారీల వద్దకు వచ్చిన తరువాత లైన్లలో వేచి చూడాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం మాత్రం కనిపించడం లేదు లారీ యజమానులకు.
అనుమతి ఇచ్చిందెంతా..?
వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మందస్తుగానే గోదావరి నుండి ఇసుక సేకరించి పెద్ద ఎత్తున స్టాక్ చేసుకునేందుకు టీఎస్ఎండీసీ అధికారులు అనుమతి ఇస్తారు. అయితే ఈ స్టాక్ యార్డుకు సంబంధించిన వివరాలను క్వారీ నిర్వహకులు ముందుగానే స్టాక్ యార్డ్ భూములకు సంబంధించిన లీజ్ డీడీలను అందించాలి. ఈ మేరకు స్టాక్ యార్డు పెట్టిన భూముల సర్వే నెంబర్ల వివరాలను కూడా అందులో పొందుపరుస్తారు. నిర్వహకులు లీజ్ తీసుకున్న భూమి ఎంత..? అందులో ఎంతమేర ఇసుక స్టోర్ చేయవచ్చు అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామర్థ్యానికి మించిన ఇసుక సేకరించి క్వారీ యజమానులు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు…? టీఎస్ఎండీసీకి సంబంధం లేకుండా ఉన్న భూముల్లో ఇసుక నిల్వలు ఉంచడం నిబంధనలకు విరుద్దమే అవుతుంది కదా.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రీచ్‌ల వద్ద సేకరించిన ఇసుక ఎంత? ఈ ఇసుక ఎన్ని లారీలకు సరిపోతుంది? ఎన్నింటికి అనుమతి ఇవ్వాలి అన్న అంచనాలు లేకుండా ఇబ్బడిముబ్బడిగా డీడీలు తీసుకుని అనుమతులు ఇవ్వాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారెందుకో అంతుచిక్కకుండా పోయింది. ఒక వేళ క్వారీ యజమానులు ఎక్కువ మొత్తంలో ఇసుక స్టాక్ ఉందని టీఎస్ఎండీసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టయితే నిబంధనల ప్రకారం సంబంధిత రీచ్ లో ఎంత ఇసుక ఉండాలి, ఎన్ని ఎకరాలు లీజ్ తీసుకున్నారు, అందులో ఉండాల్సిన పరిణామం ఎంత అన్న విషయాలపై విచారించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై రీచ్ నిర్వహకులకు, టీఎస్ఎండీసీ అధికారులకు మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం వల్లే తరుచూ రీచ్‌లో గొడవలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్కింగ్ స్థలాలేవీ..?
ఇక ప్రధానంగా ఇసుక రీచ్‌ల వద్దకు వచ్చే లారీలు పార్క్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలు కెటాయించకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. మహదేవపూర్ మీదుగా అంతరాష్ట్ర రవాణా వ్యవస్థ మెరుగు పడపడం, మరోవైపున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు, ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే వారి వాహనాలతోనే రహదారి రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో ఇసుక లారీలు కూడా ఇదే రహాదారి పక్కన పార్కింగ్ చేస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీఎస్ఎండీసీకి మాత్రం చాలా మంది నిర్వహకులు పార్కింగ్ స్థలం లీజ్ తీసుకున్నట్టుగా చూపిస్తున్నా లారీలు మాత్ర సంబందం లేని చోటే పార్కింగ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అటవీ శాఖకు చెందిన ఖాళీ ప్రదేశాల్లో కూడా లారీలను నిలిపి పర్మినెంట్ పార్కింగ్ ప్లేస్ లుగా మార్చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఆఫీసు జంప్…
పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లు ఉన్న మహదేవపూర్ మండలంలో ఇసుక రవాణ సక్రమంగా జరిగేందుకు, అక్రమాలు లేకుండా నిలువరించేందుకు ప్రత్యేకంగా పీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలంగా మహదేవపూర్ లోనే ఉన్న ఈ కార్యాలయాన్ని కాళేశ్వరానికి తరలించారు. మండలంలోని కాళేశ్వరంతో పాటు మహదేవపూర్, బొమ్మాపూర్, సురారం, బెగ్లూరు, ఎలికేశ్వరంలలో కూడ క్వారీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ మధ్యన ఉన్న మహదేవపూర్ లో ఉన్న పీఓ కార్యాలయాన్ని కాళేశ్వరానికి ఎందుకు మార్చారో అంతుచిక్కకుండా తయారైంది.