‘షహీన్‌బాగ్’కు స్వల్ప విరామం

by Shamantha N |
‘షహీన్‌బాగ్’కు స్వల్ప విరామం
X

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దాదాపు 50రోజులకు పైగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనలకు నేడు స్వల్ప విరామం పడినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో నిరసనకారులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరారు. దీంతో నిరసనాస్థలం ఖాళీగా ఉన్నది. ఓక్లా నియోజకవర్గంలో ఉన్న షహీన్‌బాగ్‌లో అత్యధికంగా మైనార్టీ వర్గానికి చెందినవారే ఉంటారు. ఈ నియోజవకర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమనతుల్లా బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి పర్వేజ్ హష్మీ, బీజేపీ నుంచి బ్రహ్మసింగ్‌లు పోటీలో ఉన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాలున్న ఈ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా, నిరసనకారులంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల ముందు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. నిరసనల్లో అధికంగా వృద్ధులే పాల్గొనడంతో వారిని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్‌లకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed